తొర్రూరులో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్
తొర్రూరు/నాగారం: దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకే సీఎం కేసీఆర్ ‘దళితబంధు’కుట్ర పన్నారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకే ‘దళిత బంధు’పథకం ద్వారా లబ్ధి జరుగుతోందని ఆరోపించారు. బీఎస్పీ రాజ్యాధికార యాత్ర మంగళవారం తొర్రూరు పట్టణానికి చేరుకుంది. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహించిన కాన్షీరాం జయంతి వేడుకల్లో ప్రవీనమార్ ప్రసంగించారు.
రైతుబంధు పథకం కింద పంపిణీ చేసిన రూ.50వేల కోట్లలో రూ.10వేల కోట్లు మాత్రమే చిన్న, సన్నకారు రైతులకు అందాయని అన్నారు. రూ.2.50లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో బలహీన వర్గాలు, దళిత, గిరిజనుల వాటా స్వల్పమన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారి ప్రజలను బలిగొంటోందని, గ్రామాల్లో ఐదు ఇళ్లకు ఒక వితంతువు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు... సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, ఫణిగిరిలోని బౌద్ధక్షేత్రం వద్ద స్వేరోస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ దీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జ్ఞానసమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, పవిత్ర జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, ఓటును వజ్రాయుధంగా భావించాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని స్వేరోలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment