నాడు చెత్త కుప్పల మధ్య అముద,
కోదాడ: అముద ఆపదలో ఉంది.. ఒకప్పుడు చెత్తకుప్పల మధ్య తిరిగిన ఆమె.. అటెండర్ ఉద్యోగం వరకు ఎదిగింది. అయితే ఇప్పుడు కేన్సర్ బారినపడి మృత్యువు ముంగిట మరో జీవన్మరణ పోరాటం చేస్తోంది. నాడు ఆమెను ఆదరించి అండగా నిలిచిన నిరుపేద వెంకటేశ్వర్లుకు అముదకు చికిత్స చేయించే స్థోమత లేక సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఎవరీ అముద..
పది సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్డులో మతిస్థిమితం కోల్పోయి.. చెత్త కుప్పల మధ్య తిరుగుతున్న ఉన్న ఓ యువతిని.. సమీపంలో చెప్పులు కుట్టుకొని జీవిస్తున్న నిరుపేద వెంకటేశ్వర్లు చూసి ఆదరించి మంచి మనిషిగా మార్చారు. సొంత బిడ్డలా చూసుకుంటూ అండగా నిలిచారు.
ఆమె మంత్రి హరీశ్‌రావు చొరవతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది. అముద గురించి ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనాలను చూసిన ఒకరు ఇటీవలే ఈమె జీవితాన్ని సినిమాగా తీస్తున్నారు. కాగా, అనారోగ్యంతో ఉద్యోగానికి వెళ్లలేకపోవడంతో మార్కెట్ కమిటీ అముద జీతం నిలిపి వేసింది. దీంతో ఆమె కష్టాలు తీవ్రమయ్యాయి.
జ్వరం వచ్చిందని వెళితే..
నెల రోజుల క్రితం వరకు బాగానే ఉన్న అముదకు ఇటీవల జ్వరం రావడంతో వెంకటేశ్వర్లు ఆమెను కోదాడ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని చెప్పడంతో.. ఓ డాక్టర్‌కు చూపించారు. ఆయన కేన్సర్ సోకిందనే అనుమానంతో బసవతారకం ఆస్పత్రికి సిఫార్సు చేశారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు కేన్సర్ సోకిందని నిర్ధారించడంతోపాటు వెంటనే చికిత్స చేయించాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పడంతో వెంకటేశ్వర్లు అముదను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నా.. కొద్ది రోజుల్లోనే ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. నిరుపేద అయిన వెంకటేశ్వర్లు అముద చికిత్సకు చేయూతనందించాలని దాతలను కోరుతున్నారు. దాతలు అముద అకౌంట్‌కు తమకు తోచినంత డబ్బు పంపితే ఆమె బతుకుతుందని అంటున్నారు.
పల్లె అముద నారాయణ నాడర్
అకౌంట్ నంబర్: 6247 8971579
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఎస్‌బీఐఎన్ 0020181
ఫోన్: 93915 42070
Comments
Please login to add a commentAdd a comment