సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ల మార్పిడికి అనుమతి లేదని కేంద్రం తేల్చిచెప్పింది. మొదటి డోసు ఏ కంపెనీ టీకా వేసుకుంటారో రెండో డోసు కూడా అదే వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు అనుమానాలను నివృత్తి చేస్తూ తాజాగా నివేదిక విడుదల చేసింది. కోవిన్ యాప్‌తో అందరికీ ఒకే వ్యాక్సిన్ అందేలా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొదటి డోసు ఏ టీకా వేశారో రెండో డోస్ కూడా అదే వేసేలా నిర్వాహకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొంది. అయితే రెండు డోసుల టీకాలు ఎంతకాలం కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయన్న దానిపై స్పష్టత లేదని కేంద్రం తెలిపింది. భవిష్యత్తులో రెండో డోసు తర్వాత బూస్టర్ డోసు అవసరంపై ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేసింది.
రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనని, భౌతికదూరం పాటించాల్సిందేనని తెలిపింది. తద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా తమను, చుట్టుపక్కల వారి ని రక్షించుకోవడం తప్పనిసరని పేర్కొంది. టీ కాలు పొందిన వ్యక్తుల్లో యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయో నిర్ధారణ కాలేదని, అందు వల్ల కరోనా జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. అన్ని టీకాలు పరివర్తన చెందిన వైరస్ నుండి కూడా తగిన స్థాయిలో రక్షణను అందిస్తాయని భావిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
మరికొన్ని అంశాలు..
► కరోనా నుంచి కోలుకున్న వారికి 3 నెలల తర్వాత టీకా వేయవచ్చు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ వేసుకున్న వారికి 3 నెలలపాటు టీకాను వాయిదా వేయాలి. అలాగే మొదటి డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకితే రెండో మోతాదును క్లినికల్ రికవరీ నుంచి 3 నెలలు వాయిదా వేయాలి.
► కోవిన్ పోర్టల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కరోనా టీకా కేంద్రాల్లో వివిధ వ్యాక్సిన్‌ల లభ్యత వివరాలు ఉంటాయి. లబ్ధిదారులు వారికి నచ్చిన టీకా వేయించుకోవచ్చు.
► వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని నిర్ధారణ అయింది. టీకా తయారీ కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ ఏ దశలోనూ నమూనా పరిమాణాన్ని తగ్గించలేదు. అయితే ఇది సాధారణంగా వ్యాక్సిన్ పరీక్షించే దానికంటే పెద్దది. చాలా టీకాలు 2 లేదా 3 నెలల పరిశీలన వ్యవధిలో 70 నుంచి 90% సామర్థ్యాన్ని చూపించాయి. ఊ అన్ని టీకాలు కరోనా సంక్రమణను నివారించడంలో బాగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ టీకాతో మేలే తప్ప నష్టం ఉండదు.
► టీకా షెడ్యూల్ మొత్తం రెండు విడతలు పూర్తయిన తర్వాత తగినన్ని యాంటీబాడీస్ వస్తాయి.
► కరోనా టీకా మహిళల సంతానోత్పత్తిని ప్రభావితం చేయదు. అన్ని టీకాలను మొదట జంతువుల్లో, తర్వాత మనుషుల్లో పరీక్షించారు. టీకాల భద్రత, సమర్థతపై భరోసా ఇచ్చాకే వాటిని ఉపయోగించడానికి అనుమతి ఇచ్చాం.
► టీకా తీసుకునే ముందు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా పరీక్షించాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment