హైదరాబాద్ : చాంద్రాయణ గుట్ట ఫలక్‌నూమా వద్ద దెబ్బతిన్న ఆర్.ఓ.బి ని, ముంపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు ప్రవీణ్ వశిష్ఠ, అధికారులు ఎం.రఘురామ్, ఎస్ కె కుష్వారా మాట్లాడారు. ఆర్ ఓ బి.కి రెండు వైపుల చేపట్టిన పునరుద్దరణ, నాలా నుండి తొలగిస్తున్న పూడిక తీత పనులను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలతో తమ ఇళ్లలోకి నీళ్లు వచ్చినట్లు ఆ ప్రాంత ప్రజలు కేంద్ర కమిటికి వివరించారు. ఇప్పటికి రోడ్లపై, ఇళ్లలోనూ నీళ్లు అలాగే పేరుకుపోయి ఉన్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు నీళ్లలో నానడం పట్ల తమ ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. (హైదరాబాద్‌లో కంపించిన భూమి )
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్‌లు మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఫలక్‌నూమా ఆర్.ఓ.బి ని నిర్మించినట్లు తెలిపారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు, చార్మినార్ ప్రాంతాలకు ఆర్.ఓ.బితో రోడ్డు సదుపాయం అనుసంధానం అయినట్లు తెలిపారు. అదేవిధంగా పల్లె చెరువు నుంచి వచ్చే వరద నీటి నాలా 7 మీటర్ల వెడల్పు ఉంటుందని, అది ఆర్.ఓ.బి కింద నుంచి వెళ్తుందని తెలిపారు. పల్లెచెరువు తెగిపోవడం వల్ల వచ్చిన వరదతో ఈ ప్రాంతానికి అపార నష్టం జరిగినట్లు తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్.ఓ.బి రిటైనింగ్ వాల్వ్ దెబ్బతిన్నదని, అదేవిధంగా అనేక కాలనీలు వరద ముంపుకు గురైనట్లు తెలిపారు. రోడ్లపై 5 మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచినట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. (ప్రమాదకర స్థాయికి చెరువులు )
Comments
Please login to add a commentAdd a comment