
సాక్షి, హైదరాబాద్: వేసవిలో దేశవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో హైప్రైస్ సెగ్మెంట్ కింద విద్యుత్ ఎక్చేంజీల్లో యూనిట్‌కు రూ.20 గరిష్ట పరిమితితో విద్యుత్‌ను విక్రయించుకోవడానికి అనుమతిస్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) ఉత్తర్వులు జారీ చేసింది. హైప్రైస్ డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్ పేరుతో ఈ విక్రయాలు జరపుకోవచ్చు. ఇతర సెగ్మెంట్ల కింద యూనిట్‌కు రూ.10 గరిష్ట పరిమితితో విక్రయాలు జరపాలని ఆదేశించింది.
గతేడాది వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఎక్చేంజీల్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ఎక్చేంజీల్లో విక్రయించే ధరలపై యూనిట్‌కు రూ.12 గరిష్ట పరిమితి విధిస్తూ 2022 జూన్ 30న సీఈఆర్సీ సుమోటో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో పవర్ ఎక్చేంజీల్లో విద్యుత్ ధరలు యూనిట్‌కు హైప్రైస్ సెగ్మెంట్ కింద రూ.0–20, ఇతర సెగ్మెంట్ల కింద రూ.0–10 వరకు ఉంటాయి. మరుసటి రోజుకు అవసరమైన అదనపు విద్యుత్‌ను ఒకరోజు ముందే విద్యుత్ ఎక్చేంజిల్లో డే అహెడ్ మార్కెట్, గ్రీన్ డే అహెడ్ మార్కెట్ విధానంలో డిస్కంలు కొనుగోలు చేస్తాయి.
అదేరోజు అవసరమైన విద్యుత్‌ను కనీసం 15 నిమిషాల ముందు రియల్ టైమ్ మార్కెట్ విధానంలో బుక్ చేసుకుంటాయి. ఈ విభాగాల కింద రూ.0–10 ధరతో యూనిట్ విద్యుత్ విక్రయాలకు తాజాగా సీఈఆర్సీ అనుమతిచ్చింది. దిగుమతి చేసిన బొగ్గు/గ్యాస్ ఆధారిత విద్యుత్‌ను ఎక్చేంజీల్లో హైప్రైస్ డే అహెడ్ మార్కెట్ విభాగం కింద యూనిట్‌కు రూ.50 ధరతో విక్రయించడానికి ఇండియన్ ఎనర్జీ ఎక్చేంజీకి అనుమతిస్తూ ఫిబ్రవరి 16న సీఈఆర్సీ ఉత్తర్వులిచ్చింది. తాజా ఆదేశాలతో యూనిట్‌కు రూ.20 గరిష్ట ధరతో హైప్రైస్ విద్యుత్ అమ్ముకోవడానికి అన్ని పవర్ ఎక్చేంజీలకు అనుమతిచ్చినట్టు అయింది.
Comments
Please login to add a commentAdd a comment