
సాక్షి, హైదరాబాద్: దళిత బంధు పథకం మాదిరిగానే గిరిజన బంధు పథకం అమ లుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం మంచిదేననీ, రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ పథకం అమలు చేయాలనేది తమ పార్టీ అభిప్రాయమన్నారు.
షెడ్యూల్ కులాలకు చెందిన వారి మాదిరిగానే గిరిజనులు కూడా వారి కాళ్లమీద వారు నిలబడటానికి గిరిజన బంధు పథకం దోహదపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోడు భూములను సాగుచేసుకుంటున్న ఆదివాసీ/గిరిజనులపై ఫారెస్టు అధికారులు, పోలీసులు కేసులు పెట్టడమే కాకుండా పంటలను పాడు చేయడాన్ని నియంత్రించాలన్నారు.