
సాక్షి, హైదరాబాద్; వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా విదేశాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటే నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. నాలుగు రోజుల్లోపు తిరుగు ప్రయాణ టికెట్‌లతో వ్యాపార నిమిత్తం వచ్చే వారు తమ ప్రయాణానికి 96 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వస్తే క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా, వ్యాధి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయించారు. వారు కేవలం 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉంటే చాలని తెలిపారు. అలాగే గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు, వైద్య అవసరాల నిమిత్తం ప్రయాణిస్తున్న వాళ్లు హోమ్ క్వారంటైన్‌లో ఉండవచ్చు. నెగెటివ్ రిపోర్టు లేని వాళ్లు మాత్రం కచ్చితంగా 7 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు రెగ్యులర్ విమానాలు (ఎయిర్ ట్రాఫిక్ బబుల్ ఒప్పందం మేరకు) రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్ విమానాశ్రయానికి వందే భారత్ మిషన్ కింద చార్టర్డ్ విమానాలు, ఇతర విదేశీ విమాన సర్వీసులు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకుపోయిన 55 వేల మంది నగరానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment