సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (వైటీపీఎస్)కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ(ఎంవోఈఎఫ్) జారీ చేసిన పర్యావరణ అనుమతులను చెన్నైలోని దక్షిణాది జోన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సస్పెండ్ చేసింది. తొలుత విదేశీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టుగా ప్రతిపాదించి, తర్వాత దేశీయ బొగ్గుకు మారడంతో.. ఇందుకు అనుగుణంగా కొత్తగా పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ ముంబైకి చెందిన ‘ది కన్జర్వేషన్ యాక్షన్ ట్రస్ట్’ అనే సంస్థ వేసిన కేసులో ఎన్జీటీ సెప్టెంబర్ 30న ఈ తీర్పు ఇచ్చింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ జెన్‌కో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఇలాంటి సమయంలో అనుమతులను నిలిపేయడంతో జెన్‌కోకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.
యంత్రాలు బిగించరాదు
యాదాద్రి ప్లాంట్ విషయంగా మళ్లీ కొత్తగా పర్యావరణ ప్రభావంపై మదింపు (ఈఐఏ) చేయించాలని తెలంగాణ జెన్‌కోను ఎన్జీటీ ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ)తో మళ్లీ పరిశీలన జరిపించి కొత్తగా పర్యావరణ అనుమతులు పొందాలని స్పష్టం చేసింది. అప్పటివరకు ప్రాజెక్టును పూర్తి (కమిషనింగ్) చేయరాదని, యంత్రాలను బిగించకూడదని ఆంక్షలు విధించింది.
మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను మాత్రం కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఈఐఏ నివేదికల ఆధారంగా కేంద్ర పర్యావరణ శాఖ తీసుకోనున్న తదుపరి నిర్ణయానికి లోబడి ఈ నిర్మాణ పనులు ఉండాలని స్పష్టం చేసింది. ఆ అధ్యయనం ఆధారంగానే ఎలాంటి యంత్రాలు వాడాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది.
ఎన్జీటీ తీర్పులో పేర్కొన్న అంశాలు, సూచనలు
దిగుమతి చేసుకున్న బొగ్గు లింకేజీ కోసం ఎలాంటి ఒప్పందం లేదు. బొగ్గు దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో 100శాతం దేశీయ బొగ్గును వినియోగించనున్నట్టు తెలంగాణ జెన్‌కో వాదించింది. ఈ పరిస్థితిలో గాలి నాణ్యతపై ఈఐఏ కన్సల్టెంట్‌తో మళ్లీ అధ్యయనం జరిపించాలి.
ఎఫ్‌జీడీ, ఇతర కాలుష్య నియంత్రణ చర్యలను అధ్యయన నివేదికకు అనుగుణంగా పునః సమీక్షించాల్సి ఉండనుంది. కింద పేర్కొన్న అంశాల్లో తదుపరి అధ్యయనాల కోసం జెన్‌కోకు అదనపు టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (నిబంధనలు/టీఓఆర్)ను కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేయాలి.
►రేడియోధార్మికతపై అధ్యయనం కోసం బొగ్గు లింకేజీ వివరాలను జెన్‌కో తెలియజేయాలి. ఆ మేరకు బొగ్గుతో ఉండే ప్రభావంపై అధ్యయనం జరిపించాలి. 100శాతం దేశీయ బొగ్గుకు మారాలనుకుంటే.. దీనితో పర్యావరణంపై ఉండే ప్రభావంపై తదుపరి అధ్యయనం జరిపించాలి. దీని కోసం కేంద్ర పర్యావరణ శాఖకు జెన్‌కో దరఖాస్తు చేసుకోవాలి. బొగ్గు లింకేజీ విషయంలో అదనపు టీఓఆర్ అవసరమైతే పర్యావరణ శాఖ జారీ చేయాలి. పర్యావరణ ప్రభావంపై మళ్లీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి.
►బూడిద కొలను (యాష్ పాండ్) సామర్థ్యం, డిజైన్, నిర్వహణపై అవసరమైతే అధ్యయనం కోసం పర్యావరణ శాఖ ఆదేశించాలి.
►పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతపై పడే ప్రభావంపై సమగ్ర అధ్యయనం జరిపించి, నివారణ చర్యలు తీసుకోవాలి.
►అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 10 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉందని సైట్ పరిశీలన నివేదికలో పేర్కొన్నారు. పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌తో పాటు ఈఐఏ నివేదిక సైతం కచ్చితమైన దూరాన్ని చెప్పలేకపోయింది. పరిధిలో లోపల ఉంటే నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీడబ్ల్యూఎల్) నుంచి క్లియరెన్స్ అవసరం. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌తో సమన్వయంతో జెన్‌కో.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎంత దూరంలో ఉందో కచ్చితంగా నిర్థారణ జరపాలి. జోన్ పరిధిలో ఉంటే ఎన్‌బీడబ్ల్యూఎల్ నుంచి క్లియరెన్స్ పొందాలి.
►వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ వచ్చాక.. ప్రాజెక్టుపై మళ్లీ మదింపు జరిపి అనుమతులకు సిఫార్సులపై నిపుణుల కమిటీ స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో పర్యావరణ శాఖకు నిర్ణయాన్ని వదిలేయాలి. మొత్తం ప్రక్రియను 9 నెలల్లో పూర్తి చేయాలి.
►గతంలో పర్యావరణంపై మెర్క్యురీ స్థాయి ప్రభావమేమీ ఉండదని విమ్టా ల్యాబ్ ఇచ్చిన నివేదికను నిపుణుల కమిటీ తోసిపుచ్చి ఐఐసీటీ హైదరాబాద్‌తో మళ్లీ అధ్యయనం జరిపించింది. ఐఐసీటీ నివేదికను కమిటీకి సమర్పించలేదు. నివేదికను కమిటీ పరిశీలిస్తేనే తదుపరిగా అధ్యయనాలు అవసరమా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవచ్చు.
►యాదాద్రి కేంద్రం కోసం 2,090 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. ఇకపై థర్మల్ విద్యుత్ కేంద్రాల వంటి కాలుష్య కారక (రెడ్ కేటగిరీ) పరిశ్రమల కోసం అటవీ భూములను కేటాయించవద్దు.
Comments
Please login to add a commentAdd a comment