కూలిస్తే ఉన్మాదం.. ప్రేమిస్తే మతం | Christmas Celebration In LB Stadium In Hyderabad | Sakshi
Sakshi News home page

KCR Christmas Dinner: కూలిస్తే ఉన్మాదం.. ప్రేమిస్తే మతం

Published Tue, Dec 21 2021 7:58 PM | Last Updated on Wed, Dec 22 2021 8:20 AM

Christmas Celebration In LB Stadium In Hyderabad - Sakshi

మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో క్రిస్మస్‌ ఉత్సవాల్లో కేక్‌ కట్‌ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, పూల ఆంథోని. చిత్రంలో కొప్పుల ఈశ్వర్, ఏకే ఖాన్‌.

సాక్షి, హైదరాబాద్‌: ఏ మతమైనా ఎదుటివారిని ప్రేమించాలనే చెబుతుందని, దాడులు చేయాలని ఎక్కడా చెప్పలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మతోన్మాదం పెరిగితేనే విషమ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. మైనారిటీలపై దాడులు తాత్కాలికమేనని, ఈ దాడులతో ఎవరూ సాధించేమీ ఉండదన్నారు. ప్రజలు ఈర్షాద్వేషాలు విడనాడి ప్రేమతత్వాన్ని అలవర్చుకోవాలని కోరారు.

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ ఉత్సవాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. 

దాడులతో మానవజాతికి జరిగిన మేలు ఏమీ లేదు..
ఒక మతం మీద మరో మతం ధ్వేషం పెంచుకొని ఆలయాలను, ప్రార్థనా మందిరాలను కూల్చడం వల్ల సాధించిందేమిటని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ‘గతంలో ముస్లింలు గుడులపై దాడులు చేస్తే హిందువులు మసీదులపై దాడులు చేశారు. దీనివల్ల మానవజాతికి జరిగిన మేలు ఏమీ లేదు. ఎదుటివారిని ప్రేమించాలి. మానవజాతికి అదే కావాలి. దేశ జీడీపీ, రాష్ట్ర జీడీపీ అంటే ఏదో ఒక మతానికో సంబంధించిన కాదు. దేశం, రాష్ట్రంలోని ప్రజలందరిదీ’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 

మనిషిని మనిషిగా చూడలేని వాడు మనిషే కాడు
‘ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలి. ఎదుటివారిని ప్రేమించడమే అత్యుత్తమ మతం. మనిషిని ప్రేమించడమే గొప్ప లక్ష్యం. మనిషిని ప్రేమించలేని వాడు... మనిషిని మనిషిగా చూడలేని వాడు అసలు మనిషే కాదు. మతంలో తప్పులేదు. తప్పు చేయాలని మతం ఎక్కడా చెప్పలేదు. మనిషిని ప్రేమించాలని మాత్రమే మతం చెప్పింది. తప్పు చేయాలని మత బోధకులు చెప్పలేదు. ఈర‡్ష్య, ద్వేషం పెంచుకోవాలని చెప్పలేదు. ప్రేమించాలని, శాంతియుతంగా ఉండాలని చెప్పారు’అని సీఎం అన్నారు.  

అందరిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే
‘రాష్ట్రంలో ప్రజలంతా ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో పండుగలను సెలబ్రేట్‌ చేయాలని ఎవరూ చెప్పలేదు. దరఖాస్తులు పెట్టలేదు. ఎన్నో పోరాటాలు, అనేక క్షోభలు ఎదుర్కొన్న తెలంగాణలో అందరూ బాగుండాలని ఓ పాలసీగా తీసుకున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుంటుంది. తెలంగాణలో ఎవరిపైనా ఎవరూ దాడి చేయరు. అందరినీ కాపాడే బాధ్యత తెలంగాణ సర్కార్‌దే. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎట్టుండే... ఇప్పుడు ఎట్లుంది? ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను నిర్మించుకొని ఏటా 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించి దాన్ని కొనాలని కేంద్రంతో కొట్లాడే స్థాయికి తెలంగాణ ఎదిగింది’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

అన్ని రంగులు కలబోసుకున్న దేశం ఇండియానే
‘ప్రపంచంలోని ఇస్లాం దేశాల్లో రెండే పండుగలుంటాయి. క్రిస్టియన్‌ దేశాల్లోనూ అంతే. కానీ నెల తిరక్కుండానే పండుగలు చేసుకొనే దేశం ఇండియా ఒక్కటే. క్రిస్మస్, రంజాన్, దసరా, దీపావళి, సంక్రాతి... ఇలా అన్ని పండుగలను జరుపుకుంటాం. ప్రపంచంలో అత్యంత రంగుల దేశం ఇండియా ఒక్కటే. భారత్‌ అత్యుత్తమ దేశం. ఈ దేశంలో ప్రేమైక సమాజం కావాలి’అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరే అన్నారు.

రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి చేస్తున్న కృషి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారు ఎ.కె. ఖాన్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, క్రైస్తవ ప్రతినిధులు జాన్‌ గొల్లపల్లి, పూల ఆంథోని, సతీశ్‌ కుమార్, సాల్మన్, డేనియల్, రాబెల్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: కిషన్‌ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి నిరంజన్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement