సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. సాధారణ పరీక్షలతో పాటు ప్రజలకు అత్యాధునిక, ఖరీదైన వైద్య పరీక్షలు సైతం ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో నెలకొల్పిన వైద్య పరీక్షా కేంద్రాలను (డయాగ్నొస్టిక్ సెంటర్లను) ఈ నెల 7వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆ జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లో ఇప్పటికే డయాగ్నొస్టిక్ సెంటర్లు సిద్ధమయ్యాయని అధికారులు నివేదించగా.. సోమవారం వాటిని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వైద్య చరిత్రలో ఇదో గొప్ప సందర్భమని ఆయన పేర్కొన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు.. వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసేవలు ప్రజలకెంతో మేలు చేస్తాయని చెప్పారు. మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటున్నన్న రోగి అవసరమైన పక్షంలో, స్వయంగా ఈ కేంద్రాలకు రాలేని పరిస్థితుల్లో.. వైద్యుని సిఫారసు లేఖతో నమూనాలు పంపించి పరీక్షలు చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ పథకానికి త్వరలోనే మంచి పేరు పెడతామని, ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైద్యారోగ్యశాఖ ఉన్నధికారులతో శనివారం మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బీపీ, షుగర్ మొదలు..
‘ఈ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా, రక్త, మూత్ర, బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, ఎముకల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ సంబంధిత జబ్బుల నిర్ధారణకు ఎక్స్–రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదైన పరీక్షలను కూడా పూర్తి ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారు. పరీక్షల రిపోర్టులను రోగుల సెల్‌ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసింది.
అధునాతన, ఖరీదైన యంత్రాలు
అత్యంత అధునిక సాంకేతికతతో కూడిన ఖరీదైన యంత్రాలను పరీక్షా కేంద్రాల కోసం ప్రభుత్వం సమకూర్చింది. ఇలాంటి యంత్రాలు పెద్దపెద్ద కార్పొరేట్ దవాఖానాల్లో.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ దవాఖానాలల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యునో అస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్, ఎలీసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలతో పాటు ఈసీజీ, టూడీ ఎకో, ఆల్ట్రా సౌండ్, డిజిటల్ ఎక్స్– రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలు.. అత్యంత కచ్చితత్వంతో వేగంగా రిపోర్టులందిస్తాయి.
గంటకు 400 నుంచి 800 రిపోర్టులు అందజేస్తాయని వైద్యాధికారులు తెలిపారు. రూ.కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రాలతో తక్కువ సమయంలో ఎక్కువ మంది పేదలకు రోగ నిర్ధారణలు చేసి, వైద్య సేవలందించగలుగుతాం. అందుబాటులో లేనిచోట్ల సీటీ స్కానింగ్ యంత్రాలను కూడా దశలవారీగా ఏర్పాటు చేస్తాం. ఈ పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మేరకు పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, రేడియాలజిస్టులు, సహా పరీక్షలను నిర్వహించేందుకు అర్హులైన ఇతర సాంకేతిక సిబ్బందిని కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది..’అని సీఎం తెలిపారు.
వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారింది..
‘ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకుందానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. వైద్యం కంటే రోగ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువైంది. ఈ నడుమ ప్రతి మనిషికి బీపీలు, షుగర్లు ఎక్కువయినయి. వాటి పరీక్ష చేయించుకోవాలి. గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సరు, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన పరీక్షలు సామాన్యులకూ, పేదలకు అవసరంగా మారినయి. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి ఒకటి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరింది. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తడు. కానీ పరీక్ష కోసం ఎక్కడికో ప్రైవేట్ సెంటర్లకు పోయి వేలకు వేలు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం..’అని ముఖ్యమంత్రి వివరించారు.
డయాగ్నొస్టిక్ కేంద్రాలు ప్రారంభంకానున్న జిల్లాలు ఇవే..
మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్
నిర్వహించే పరీక్షలివే..
కరోనా, రక్త, మూత్ర, బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, ఎముకల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ సంబంధిత జబ్బుల నిర్ధారణకు ఎక్స్–రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీ..
ప్రజలకెంతో మేలు
►కరోనా వంటి ఆపత్కాలంలో ప్రభుత్వం వినియోగంలోకి తెస్తున్న డయాగ్నొస్టిక్ సేవలతో ప్రజలకెంతో మేలు జరుగుతుంది.
గంటకు 800 రిపోర్టులు
►అత్యాధునిక యంత్రాలతో కచ్చితమైన, వేగవంతమైన ఫలితాలు వస్తాయి.. గంటకు 400 నుంచి 800 వైద్య పరీక్షల రిపోర్టులు అందజేస్తాయి.
రోగులకే ఎస్‌ఎంఎస్‌లు
►అందుబాటులో పాథాలజిస్టులు, మైక్రో బయాలజిస్టులు, రేడియాలజిస్టులు ఉంటారు. రోగులకు నేరుగా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వైద్య పరీక్షల నివేదికలు పంపిస్తారు.
ఆస్తులు అమ్ముకుంటున్నారు
►పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకోవడానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. వైద్యం కంటే నిర్ధారణ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువయింది. – కేసీఆర్
చదవండి:
Etela Rajender: అది ప్రగతి భవన్ కాదు.. బానిసల భవన్
ఈటల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నేతల కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment