సాక్షి, హైదరాబాద్: ‘ఈ దేశం మనందరిది. ఇక్కడి గంగాజమున సంస్కృతిని, ఆచార, సంప్రదాయాలను ఎవరూ మార్చలేరు. అలా ప్రయత్నించిన వారు అంతమవుతారు. దేశం మాత్రం నిలిచే ఉంటుంది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. సమయం వచ్చి నప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్రయోగించాలని పిలుపునిచ్చారు. ప్రతియేడు తరహాలోనే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ఉర్దూలో మాట్లాడుతూ, తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతం కోసం చివరి రక్తపు బొట్టువరకు పోరాడితే విజయం తథ్యమన్నారు. ‘అల్లా కే ఘర్ దేర్ హై, లేకిన్ అంధేర్ నహీ’(దేవుడి ఆశీస్సులు ఆలస్యం కావచ్చు.. అంధకారం ఉండదు) అని ముక్తాయించారు. గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభిస్తే గమ్యం చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవ్వొచ్చుగానీ, గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు.
‘దేశం అగమ్యగోచర స్థితిలో ఉన్నది. సరైన నాయకుని కోసం, పార్టీ కోసం వేచి చూస్తున్నది. దేశాన్ని రక్షించుకునేందుకు శాయశక్తులా కృషి చేద్దాం. మీ సహకారం ఉంటే చివరి వరకు పోరాడగలం. ఇది తాత్కాలిక దశ. తుదకు న్యాయమే గెలుస్తుంది. ప్రస్తుత దేశ రాజకీయాలను మార్చేందుకే నేను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాను. బీఆర్‌ఎస్ పారీ్టకి మహారాష్ట్ర ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. నా అంచనాలకు మించి ప్రజాధారణ లభిస్తున్నది’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
అనాథ విద్యార్థులతో సీఎం ముచ్చట్లు
ఇఫ్తార్ విందుకు ముందు సీఎం కేసీఆర్ అనాథ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఇంగ్లిష్‌లో సంభాషిస్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు. బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని భుజం తట్టారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, క్రీడాకారులు సానియా మీర్జా, నిఖత్ జరీన్ పాల్గొన్నారు
రాష్ట్రం పురోగమనంలో.. దేశం తిరోగమనంలో..
‘తొమ్మిది, పదేళ్ళ కింద మనల్ని వెనుకబడినవారిగా పరిగణించేవారు. కానీ నేడు అల్లా దయతో, మీ అందరి ప్రార్థనలతో మన రాష్ట్రానికి దేశంలోనే పోటీ లేదు. పార్ల మెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,17,115కు, తలసరి విద్యుత్ వినియోగం 2,100 యూనిట్లకు పెరిగింది. పరిశ్రమలు, ఐటీ రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ తదితరులు కోరిన మేరకు అనీస్ ఉల్ గుర్బా(అనాథశ్రమం) ను అత్యద్భుతంగా నిర్మించుకున్నాం. మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పదేళ్లలో రూ.1,200 కోట్లను ఖర్చు చేస్తే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.12,000 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు లేవు. వలస వెళ్లిన రైతులు ఊళ్లకు తిరిగొచ్చారు. రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించుకుంటున్నామని గర్వంగా చెప్తున్నా.
మొత్తం దేశంలో వరి సాగు విస్తీర్ణం కంటే ఒక్కతెలంగాణ వరి సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ. తాగునీరు, కరెంటు సమస్యలు నేడు లేవు. నిరుద్యోగ సమస్యను కూడా మెల్లమెల్లగా అధిగమిస్తున్నాం. రాష్ట్రం ముందుకు సాగుతోంది. దేశం వెనుకబడిపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం తీరుగా కేంద్రం శ్రమిస్తే దేశ జీడీపీ కనీసం మరో 3 లక్షల నుంచి 4 లక్షలు పెరిగేది’అని సీఎం కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment