సాక్షి, హైదరాబాద్: డబ్బులుంటేనే రాజకీయాలనే ఆలోచన పక్కన పెట్టాలని, ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడూ ఎమ్మెల్యే అవ్వొచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు. డబ్బులతో రాజకీయాలకు పనిలేదనేది కాంగ్రెస్‌తో సాధ్యమైందని, ఎందరో పెద్ద వాళ్లు ఉన్నా యువకులకు, కొత్త వారికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదని, సమాజానికి ఎంత పంచామనేది ముఖ్యమని వ్యాఖ్యానించారు.
శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీలో అలుమ్నీ మీట్, గ్రాడ్యుయేషన్‌లో డేలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, విజయ రమణారావు, రాజ్‌ఠాకూర్, నాగరాజు, కాలేజీ కరస్పాండెంట్ సరోజ వివేక్ పాల్గొన్నారు. జి.వెంకటస్వామి (కాకా) విగ్రహావిష్కరణ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యానని, సీఎం కోసం ఎంతో మంది పోటీలో ఉన్నా నాకు పదవి ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాందీకి ధన్యావాదాలు తెలుపుతున్నానన్నారు. నేతలంతా రోజుకు 18 గంటల కఠోర దీక్షతో పనిచేస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ చెప్పారు.
కాకా సేవలు చిరస్మరణీయం...
తెలంగాణ ఉద్యమంలో కాకా కుటుంబం ముందుందనీ, దేశ నిర్మాణంలో కూడా కాకా పాత్ర ఉందని, అలాంటి కాకా వర్ధంతి రోజున గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం గొప్ప విషయమన్నారు. 1973లో ప్రారంభమైన ఈ విద్యా సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంతో మందిని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారు చేసిందని అభినందించారు. కాకా తర్వాత ఈ విద్యా సంస్థను నడిపిస్తున్న ఇద్దరి కొడుకులను చూస్తుంటే లవకుశలను చూసినట్లు అనిపిస్తోందని కొనియాడారు.
విద్యార్థుల భవితకు అండగా ఉంటాం
బీఆర్ అంబేడ్కర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి చేయూతనందించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అన్ని రంగాలను ప్రభుత్వమే అభివృద్ధి చేయదని, చేసేవాళ్లకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment