కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాల నాటికి స్పష్టమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్రతిపాదనలు అందించిన 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి గురువారం చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతోపాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
ఉపాధి అవకాశాలే లక్ష్యం
యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందించేలా నైపుణ్య విశ్వవిద్యాలయం కృషి చేయాల్సిన అవసరముందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఐఎస్‌బీ తరహాలో ఒక బోర్డు ఏర్పాటు అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది.
స్కిల్ యూనివర్సిటీలో ఉండాల్సిన కోర్సులు, బోధన ప్రణాళికపై సమగ్ర అధ్యయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరికులమ్, కోర్సులకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని తెలిపారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున, ప్రతీ ఐదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు.
ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమా..?
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టగలదా అనే అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమలశాఖ నోడల్ డిపార్ట్‌మెంట్‌గా ఉంటుందని సీఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్‌రెడ్డి, విష్ణువర్దన్‌డ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీష్‌రెడ్డి, భారత్ బయోటెక్ హరిప్రసాద్, క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్‌రెడ్డి, ఐ ల్యాబ్స్ శ్రీనిరాజు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, శ్రీధర్‌బాబు తదితరులు గ్రూపు ఫొటో దిగారు.
Comments
Please login to add a commentAdd a comment