సాక్షి, హైదరాబాద్: బోధన నచ్చలేదని చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి చేసిన వినతిని ఫిట్‌జీ పినాకిల్ సంస్థ తిరస్కరించడంతో వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచింగ్ మానేసిన విద్యార్థికి ఫీజు తిరిగి ఇచ్చేయాలని సంబంధిత సంస్థకు హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్సు మొత్తం ఫీజు మొదటే తీసుకోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది. ఫిట్‌జీలో కోర్సులో చేరి తర్వాత మానేసిన విద్యార్థి తన ఫీజు తిరిగి ఇవ్వాలని కోరగా నిరాకరించింది.
దీనిపై ఆ విద్యార్థి వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఫిట్‌జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వాదోపవాదనలు విని పైతీర్పు ఇచ్చింది. అయితే విచారణలో ‘చేరే సమయంలో విద్యార్థికి తిరిగి ఫీజు చెల్లించబోమని విషయాన్ని ముందే చెప్పాం’ అని ఫిట్‌జీ వాదించింది. ఈ ఒప్పందంపై ఆ విద్యార్థి సంతకం చేశారని కూడా గుర్తు చేయగా ఆ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. ఫీజు వివాదం వినియోగదారుల కమిషన్ పరిధిలోకి రాదని ఫిట్‌జీ విద్యా సంస్థ పేర్కొనగా కమిషన్ తిరస్కరించింది. విద్యా సంస్థ ముసుగులో కోచింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారని కమిషన్ పేర్కొంది. విద్యార్థికి రూ.4.35 లక్షల ఫీజు, రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఫిట్‌జీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది 45 రోజుల్లో చెల్లించకపోతే 9 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల కమిషన్ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment