
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మందుబాబులు బీర్ల జోలికి వెళ్లడం లేదు. ప్రత్యామ్నాయంగా లిక్కర్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రెండు నెలలుగా బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. చిల్డ్ బీరు తాగితే జలుబు చేసి కరోనాకు దారితీసే అవకాశాలున్నాయని భావిస్తున్న మద్యం ప్రియులు దాని జోలికెళ్లడం తగ్గించేశారు. బీర్ల ధరలు విపరీతంగా పెరగడం కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు నిత్యం వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా ఉంది. దీంతో మద్యం ప్రియులు బీరు బదులు లిక్కర్ వైపు మొగ్గుచూపుతున్నారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాలతో పోల్చితే బీర్ల అమ్మకాలు సుమారు 20 శాతం తగ్గినట్లు ఎక్సైజ్‌శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతేడాది (2019) సెప్టెంబర్‌లో 1.83 లక్షల బీరు కేసులు విక్రయాలు జరిగితే, ఈ ఏడాది గతనెల (సెప్టెంబర్)లో 1.40 లక్షల కేసులకు పడిపోయింది. అంటే సుమారు 43 వేల కేసులు తక్కువ వినియోగమైంది.
ఆగస్టు మాసంలో కూడా బీర్ల అమ్మకాలు తగ్గాయి. 2019 ఆగస్టులో 1.76 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగితే.. ఈ ఏడాది ఆగస్టులో 1.46 లక్షల కేసులకు తగ్గాయి. అంటే సుమారు 30 వేల కేసుల బీర్ల అమ్మకాలు తగ్గాయి. ఈ లెక్కన ఆగస్టులో కూడా సుమారు 20 శాతం అమ్మకాలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన లిక్కర్ వినియోగంబీరు ప్రియులు కూడా లిక్కర్ వైపు మొగ్గు చూపడంతో లిక్కర్ అమ్మకాలు ఊపందుకున్నాయి. 2019 సెప్టెంబర్ మాసంలో లిక్కర్ 1.12 లక్షల కేసుల విక్రయాలు జరగగా, గత నెల(2020 సెప్టెంబర్)లో 1.27 లక్షల కేసులకు పెరిగాయి. సుమారు 11 శాతం లిక్కర్ అమ్మకాలు పెరిగినట్లు తేలింది.
బీర్ల ధరలు పెరగడమూ కారణమే..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు చల్లని పానియాలు సేవించడం తగ్గించారు. దీనికి తోడు బీర్ల ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది సుమారు రూ. 120 ఉన్న స్ట్రాంగ్ బీరు ఇప్పుడు రూ. 160కి పెరిగింది. రెండు బీర్లకు వెచ్చించిన ధరలో బ్రాండెడ్ లిక్కర్ క్వాటర్ వస్తుండడంతో మందుబాబులు లిక్కర్‌ను తాగేందుకే ఎక్కువ మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తగ్గని ఆదాయం
బీర్ల విక్రయాలు తగ్గినప్పటికీ.. పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది 2019లో సెప్టెంబర్‌లో బీర్ల అమ్మకాలపై సుమారు రూ. 19.09 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో బీరు విక్రయాలపై సుమారు రూ. 23.43 కోట్ల ఆధాయం వచ్చింది. సుమారు 20 శాతం అమ్మకాలు తగ్గినప్పటికీ ఆదాయం పెరగడానికి కారణం బీర్ల ధరలు పెరగడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment