కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత వరదతో నీటమునిగిన పత్తి చేలు
వేమనపల్లి: ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రాణహితకు సహజ సిద్ధంగా వచ్చే వరద దిగువన ఉన్న గోదావరిలోకి వెళ్లకుండా మేడిగడ్డ వద్ద రిజర్వాయర్ అడ్డుగా ఉండటంతో వరద ఆదివారం రాత్రికి రాత్రే లోతట్టు పంటలను ముంచెత్తింది. దీంతో రైతులు లబోదిబోమం టున్నారు. నదీతీరం వెంట ఉన్న వేమనపల్లి, కోటపల్లి మండలాలతోపాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లోని వేల ఎకరాల్లో పత్తి పంటలు నీటిపాలయ్యాయి. వేమనపల్లి శివారులో 240 ఎకరాలు, గొర్లపల్లిలో 110 ఎకరాలు, కేతన్‌పల్లిలో 140, కల్మలపేట శివారులో 120, ముల్కలపేట 80, రాచర్ల 110, ఒడ్డుగూడెం 60, సుంపుటం 85, జాజులపేట 70, ముక్కిడిగూడం 92, కళ్లంపల్లి 60 ఎకరాలు మునిగినట్లు అధికారులు తెలిపారు.
స్తంభించిన రాకపోకలు
ప్రాణహిత వరద పోటెత్తడంతో లోతట్టు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మత్తడివాగు వరకు వరద నీరు పోటెత్తుతుండటంతో వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కళ్లెంపల్లి బొందచేను ఒర్రె, చింత ఒర్రె వంతెనలపై నుంచి వరద వెళ్తోంది. దీంతో పలు మండలాలకు రాకపోకలు స్తంభించాయి. ముల్కలపేట, రాచర్ల గ్రామాల మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు వంతెనలపై నుంచి వరద పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో కోటపల్లి, వేమనపల్లి మండలాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment