కావ్‌ కావ్‌ సేవ్‌ సేవ్‌ | Crows Disappeared Report Released By Agriculture University | Sakshi
Sakshi News home page

కావ్‌ కావ్‌ సేవ్‌ సేవ్‌

Published Sun, Nov 1 2020 2:02 AM | Last Updated on Sun, Nov 1 2020 2:58 AM

Crows Disappeared Report Released By Agriculture University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటి ముందు ఉదయమే కాకులు కావ్‌కావ్‌మని అరిస్తే.. ‘బంధువులు వస్తారేమో’ అనడం కద్దు. నలుగురు కలిసి గోల చేస్తుంటే.. ‘ఏమిటా కాకిగోల’ అని.. తప్పుల తడకలెక్కలను ‘కాకిలెక్కల’ని ఎత్తి పొడుస్తారు. ఇరుగుపొరుగు నుంచి సూటిపోటి  మాటలు ఎదురైతే.. ‘కాకుల్లా పొడుచుకుతింటున్నారు’ అంటారు. ‘ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు’.. ఇది పిసినారులను ఉద్దేశించి అనే మాట.
నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ పరి స్థితుల్లో ఇలా కాకులతో ముడిపెట్టి మాట్లాడి, పోల్చే సందర్భాలెన్నో. పెంపుడు పక్షి కాకున్నా జనంతో నిత్యం మమేకమై మసిలే పక్షి కాకి. పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు అది కనిపించని క్షణం, ‘కావ్‌కావ్‌’మని వినిపించని శబ్దం ఉండవేమో. అయితే ఇదంతా గతం. క్షణం కాదుకదా ఇక రోజుల తరబడి కాకి కనిపించ దేమో. దసరా నాడు పాలపిట్ట దర్శనం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించినట్టు భవిష్య త్తులో కాకిని చూడాలంటే.. వెతకాలేమో!. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్నేళ్లలో నగరాలు, పట్ట ణాల్లో కాకులు కనిపించటమే గగనమంటోంది ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యా లయం పక్షి విభాగం జరిపిన ప్రాథమిక అధ్య యనం. ఈ విభాగం అధిపతి వి.వాసుదేవరావు ఆధ్వర్యంలో త్వరలో దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం జరగనుంది.

చంపేస్తున్న ఔషధ వ్యర్థాలు
కాకులంటే చాలామందిలో ఏహ్య భావం ఉంటుంది. కానీ మనకు తెలియకుండా అవి చేస్తున్న మేలెంతో. చనిపోయిన జంతు కళేబరాలు వేగంగా మాయమయ్యేలా చేసి మనచుట్టూ అనారోగ్యకర వాతావరణం లేకుండా చేస్తాయివి. హిందువుల్లో చనిపోయిన వ్యక్తి కర్మకాండల్లో ‘కాకి ముట్టే’ తంతుకు చాలా ప్రాధాన్యం ఉంది. కానీ ఇప్పుడు కాకులు క్రమంగా తగ్గిపోవడానికి మనుషులే కారణమవుతుండటం విషాదం. నగరాలు, పట్టణాల్లోని ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పోగయ్యే వ్యర్థాలు కాకుల తిండిని విషతుల్యం చేస్తున్నాయి. ఆసుపత్రి వ్యర్థాలను నిజానికి శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయాలి.

ఖర్చు తగ్గించుకునేందుకు ఆసుపత్రుల నిర్వాహకులు వ్యర్థాలను నేరుగా చెత్తకుండీల్లో పారేస్తున్నారు. ఇటీవల ఇళ్లలోనూ మందుల వాడకం పెరిగింది. వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం తెచ్చుకున్న మందులను అవసరం తీరాక, నిల్వ ఉండి కాలం తీరిన ఔషధాలను చెత్తకుండీల్లో పడేస్తున్నారు. సాధారణంగా కాకులు తిండి కోసం చెత్తకుండీల వద్దకే ఎక్కువగా చేరుతుంటాయి. చెత్తలోంచి కావాల్సిన తిండిని ఏరుకుని తింటాయి. ఈ మందులు కలిసిన తిండి తిని అవి అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి. కాకులు అంతరించేందుకు ఇది ప్రధాన కారణమవుతోంది. 

కాకి చావుకు కారణాలెన్నో!
ఆసుపత్రి వ్యర్థాలు, పారేసిన ఔషధాలు కలిసిన తిండి తినడం వల్ల కొన్ని కాకులు చనిపోతుండగా ఆడ కాకుల్లో గుడ్లుపెట్టే సామర్థ్యం దెబ్బతింటోంది. ఫలితంగా వాటి సంతతి తగ్గిపోతోంది. ఇంకా కాకి చావుకు మరెన్నో కారణాలున్నాయంటున్నారు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ’ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌వర్మ.

  • పక్షుల్లో కాకులు తెలివైనవి. ప్రమాదం పొంచి ఉన్నచోట అవి ఉండటానికి ఇష్టపడవు. నగరంలో పతంగులను ఎగురవేయడానికి ఉపయోగించే మాంజా దారం పలుచోట్ల చెట్లలో ఇరుక్కుపోతోంది. ఈ మాంజా ఉచ్చులో పడి చాలా కాకులు చనిపోతున్నాయి. ఒక కాకి చనిపోతే మిగతా కాకులు అక్కడ ఉండేందుకు ఇష్టపడవు. అందుకే నగరం కంటే, శివారు ప్రాంతాల్లో కాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
  • గతంలో ఇళ్ల నుంచి చెత్తను తెచ్చి సమీపంలోని కుండీలో వేసేవారు. అందులోని తిండిని తిని కాకులు గడిపేవి. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి›మున్సిపల్‌ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. ఫలితంగా కుండీల్లో వాటికి తిండి కరువైంది.
  • ఎత్తుగా ఉండే చెట్లపైనే కాకులు గూళ్లు పెట్టుకుంటాయి. అపార్ట్‌మెంట్ల నిర్మాణంతో ఇళ్ల ప్రాంగణాల్లో ఏపుగా ఉండే చెట్లు మాయమయ్యాయి. వీధుల్లోనూ పొడవాటి చెట్లు కనిపించట్లేదు. దీంతో గూళ్లకు అనువైన వాతావరణం వెదుక్కుంటూ కాకులు వెళ్లిపోతున్నాయి.

కాకులకిది అత్యంత ప్రమాదకరస్థితి
ఆసుపత్రులు, ఇళ్ల నుంచి వచ్చే మందుల వ్యర్థాలు పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కాకులు అంతరించేందుకిది కారణమయ్యేంత తీవ్రత నెలకొంది. ఫలితంగా ఐదారేళ్లుగా కాకుల సంఖ్య బాగా తగ్గిపోతోందని మా ప్రాథమిక అధ్యయనంలో తేలింది. త్వరలో మా బృందం పూర్తిస్థాయి అధ్యయనం ప్రారంభించనుంది. అందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. – వి.వాసుదేవరావు, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త, పక్షి విభాగాధిపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement