సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం, అనుబంధ రంగాల ఆర్థికాభివృద్ధితో పాటు మరింత ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. ప్రైవేట్ పెట్టుబడులకు దోహదపడే విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం, పాడి రంగాల ద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ) వృద్ధిని పెంపొందించే కార్యక్రమాలపై బీఆర్‌కేఆర్ భవన్‌లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
వివిధ శాఖలకు చెందిన దాదాపు 30 మంది ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొని విలువైన సూచనలు అందించారు. ప్రభుత్వ శాఖల పనిలో సమర్థతను పెంపొందించడం వల్ల ప్రజల దృక్పథంలో మార్పు వస్తుందని సోమేశ్‌కుమార్ అన్నారు. అధిక ఉత్పాదకతను సాధించేందుకు వీలుగా విధానాల మార్పుపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి అపారమైన అవకా శాలు ఉన్నాయన్నారు.
సాగునీరు, విద్యుత్, సేకరణ, రైతుబంధు వంటి పెట్టుబడి మద్దతు విధానాలతో రాష్ట్రంలో రైతులు ఎంతో ప్రయో జనం పొందారని, గత ఎనిమిదేళ్లలో పంటల విస్తీర్ణం 64% పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు నివేదించారు. పంటల ఉత్పాదకతను ప్రోత్సహించడం, ఉద్యాన రంగం బలోపేతం, పంటకోత తర్వాత మెరుగైన నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ పరిశోధన, విస్తరణ వ్యవసాయ రంగంలో వృద్ధిని వేగవంతం చేయడానికి కొన్ని వ్యూహాలని తెలిపారు. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో మరింత ఉత్పాదకత, అధిక వృద్ధిని సాధించడానికి వివిధ శాఖల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment