సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిచౌంగ్ Cyclone Michaung ప్రభావంతో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను కదలిక ఆధారంగా తాజాగా ఈ అప్‌డేట్‌ను అందించింది. దీంతో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోని పలు జిల్లాలో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం పడుతోంది. వర్షం కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. మంగళ(నేడు), బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
మిచౌంగ్ ప్రభావ దృష్ట్యా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎస్ శాంతికుమారి సూచించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు.
ఇదీ చదవండి: తీవ్ర తుపాను మిచౌంగ్ ముంచేసింది
Comments
Please login to add a commentAdd a comment