దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం  | Dangerous Delta, Other Variants: Dr. GC Khilnani | Sakshi
Sakshi News home page

దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం 

Published Fri, Jun 11 2021 4:29 AM | Last Updated on Fri, Jun 11 2021 4:29 AM

Dangerous Delta, Other Variants: Dr. GC Khilnani - Sakshi

►మళ్లీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తే డెల్టా వేరియంట్‌ లేదా కొత్త వేరియంట్లు, మ్యూటెంట్ల వల్ల ప్రమాదం పెరిగే అవకాశాలున్నాయి. ఇక రాబోయే కొత్త వేరియంట్ల స్వభావ, స్వరూపాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఎవరూ ముందుగా ఊహించలేరు. 

సాక్షి, హైదరాబాద్‌: ఫస్ట్‌వేవ్‌ తర్వాత జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంతో సెకండ్‌వేవ్‌కు కారణ మైన విధంగానే మళ్లీ వ్యవహరిస్తే.. థర్డ్‌వేవ్‌ను చేజేతులా మనమే ఆహ్వానించినట్టు అవుతుందని ఢిల్లీ లోని ఎయిమ్స్‌ పల్మనరీ క్రిటికల్‌ కేర్‌ మాజీ విభాగాధిపతి, పీఎస్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ హాస్పిటల్‌ ఆఫ్‌ పల్మనరీ, స్లీప్‌మెడిసిన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ జీసీ ఖిల్‌నానీ పేర్కొన్నారు. కోవిడ్‌ మహమ్మారి ఉధృతి తగ్గుతున్నా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమైన డెల్టా వేరియంట్, ఇతర వేరియంట్లను టీకాలు పూర్తిస్థాయిలో అడ్డుకోలేక పోవడం ఆందోళన కలిగిస్తున్న అంశమని అన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్క టే మార్గమని స్పష్టం చేశారు. దేశంలో రెండు డోసుల టీకా తీసుకున్న జనాభా కూడా 4 శాతం లోపే ఉండడాన్ని ప్రత్యేకంగా గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండుడోసుల టీకా తీసుకున్న 5 నుంచి 10 శాతం మందికి కోవిడ్‌ నుంచి రక్షణ లభించడం లేదని, దాదాపు 27% జనాభాలో ఇన్ఫెక్షన్లు సోకినా లక్షణాలు కనిపించడం లేదని (అసింప్టమాటిక్‌), వైరస్‌లలో 64% దాకా వేరియెంట్లు (మ్యూటెంట్లు) ఆందోళనకు కారణమవుతున్నట్టుగా అమెరికాలోని సీడీసీ అధ్యయనం పేర్కొన్న విషయాన్ని ఆయన ఉటంకించారు. కొన్ని వేరియంట్లపై వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల రెండో డోసు తీసుకునే వ్యవధిని తగ్గించాలని ఇటీవల లాన్‌సెట్‌ జర్నల్‌ తన అధ్యయనంలో స్పష్టం చేసిందంటున్న ఖిల్‌నానీతో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 


దాడి చేశాకే లక్షణాలు తెలుస్తాయి 
ప్రమాదకరంగా మారిన డెల్టాతో పాటు కొత్త వేరియంట్ల ప్రభావాన్ని బట్టి థర్డ్‌వేవ్‌లో వ్యాధి తీవ్రత, దాని పర్యవసనాలు ఆధారపడి ఉంటాయి. ఇతర వేరియంట్లతో పోల్చితే డెల్టాకు 40 నుంచి 80 శాతం అధికంగా సోకే గుణంతో పాటు ఎక్కువ తీవ్రత కారణంగా ఎక్కువ మరణాలు సంభవిచ్చవచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.  సెకండ్‌వేవ్‌ అన్‌లాకింగ్‌ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ నిర్లక్ష్యం వహిస్తే అదే డెల్టా వేరియంట్‌ లేదా కొత్త వేరియంట్లు, మ్యుటెంట్లు దాడిచేశాకే ఆయా లక్షణా లు తెలుస్తాయి. అందువల్ల మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి మ్యూటెంట్లు, వేరియంట్ల నుంచి అయినా రక్షణ లభిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. 


డాక్టర్‌ జీసీ ఖిల్‌నానీ


కఠిన లాక్‌డౌన్‌తోనే అదుపులోకి.... 
ప్రస్తుతం భారత్‌లో లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయడం, వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అనుసరించిన ‘కంటైన్‌మెంట్‌ స్ట్రాటజీ’కారణంగానే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనాపై పోరుకు వ్యాక్సినే ప్రధాన ఆయుధంగా నిలుస్తున్నా.. కనీసం 60, 70 శాతం మందికి వ్యాక్సిన్లు వేసే వరకు కోవిడ్‌ నియంత్రణకు అవసరమైన ప్రవర్తనా నియమావళే మనకు రక్షణగా నిలవనుంది.  

సెకండ్‌వేవ్‌కు అదే కారణం 
సెకండ్‌వేవ్‌ తీవ్రస్థాయిలో దాడి చేయడానికి గత అక్టోబర్‌–మార్చి మధ్యకాలంలో మాస్క్‌లు, భౌతికదూరం, ఇతర జాగ్రత్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ప్రధానకారణమని అందరూ గ్రహించాలి. కోవిడ్‌ మహమ్మారి ఇక ముగిసిన అధ్యాయమన్న భ్రమకు, భావనకు అధికశాతం మంది లోనుకావడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం రెండోదశ క్షీణదశకు చేరుకుని కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో మళ్లీ పాత కథ పునరావృతం కాకూడదు. అదే జరిగితే వేగంగా రూపుమార్చుకుంటూ వ్యాక్సిన్లకు లొంగని కరోనా కొత్త మ్యూటెంట్లు, వేరియంట్లు విజృంభిస్తే కొత్త ఉపద్రవాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement