
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కమలం గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శ్రవణ్‌కు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.
కాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ ఛుగ్‌తో ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వెదిరె శ్రీరాంలతో కలిసి దాసోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.