సాక్షి, హైదరాబాద్: డెలివరీ పార్సిల్‌ను అందించేందుకు వచ్చిన ఓ యువకుడు...పెంపుడు కుక్క అరవడంతో భయపడి అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో తీవ్రగాయాలపాలవగా ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలోని శ్రీనిధి హైట్స్ అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో అద్దెకు ఉంటున్న నీలారాణి మూడు రోజుల క్రితం అమెజాన్‌లో పరుపు(బెడ్)ను ఆర్డర్ చేసింది. దాంతో ఆదివారం దాన్ని తీసుకుని డెలివరీ బాయ్ ఇలియాజ్ వారి ఇంటికి లిఫ్ట్‌లో వచ్చాడు.
అతను తెచ్చిన బెడ్‌ను తలుపు తెరచి ఉండటంతో ఇంట్లోకి నేరుగా వచ్చి హాల్‌లో వేశాడు. దాని చప్పుడుకు ఇంట్లో ఉన్న లాబ్ జాతి కుక్క ఒక్కసారిగా అరవటంతో అతను భయపడి పోయాడు. ఆ సమయంలో కుక్క ఎక్కడ కరుస్తుందో అనే భయంతో ఏకంగా మూడవ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకాడు. నేరుగా అపార్ట్‌మెంట్ ప్రహరీగోడపై పడటంతో నడుము భాగంలో గాయమయ్యింది. దీంతో నీలారాణి భర్త డాక్టర్ సుబ్బరామిరెడ్డి సపర్యలు చేసి 108కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి పంపారు.
డెలివరీ బాయ్ ఉదయం ఫోన్ చేసి ఈరోజు డెలివరీ చేస్తామని చెప్పాడని, వచ్చే ముందు ఎలాంటి ఫోన్ చేయటం, ఇంటి ముందుకు వచ్చి బెల్ కొట్టడం చేయలేదని, నేరుగా ఇంట్లోకి రావడం వల్లే కుక్క అరిచిందని నీలారాణి తెలిపారు. బాధితుడు తన అన్నకు ఫోన్ చేయటంతో ఓవైసీ ఆసుపత్రికి తీసుకుని రావాలని చెప్పటంతో 108 సిబ్బంది అతన్ని అక్కడకు తరలించినట్టు సమాచారం. రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సమాచారం సేకరించారు. అనంతరం నీలారాణిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment