డిజిటల్‌ పాఠాలు రెడీ | Digital Lessons Are Ready For School Children In Telangana | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ పాఠాలు రెడీ

Published Wed, Aug 26 2020 1:50 AM | Last Updated on Wed, Aug 26 2020 1:56 AM

Digital Lessons Are Ready For School Children In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు బడి పిల్లలకు డిజిటల్‌ పాఠాలు సిద్ధమయ్యాయి. కోవిడ్‌–19 నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడటంతో అవి పునఃప్రారంభమయ్యే వరకు డిజిటల్‌/ఆన్‌లైన్‌ పద్ధతిలో పాఠ్యాంశ బోధన సాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 3 నుంచి 10 తరగతుల వరకు డిజిటల్‌ పాఠాలను టీశాట్, దూరదర్శన్‌ యాదగిరి చానల్‌ ద్వారా సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సాధారణంగా కొత్త విద్యా సంవత్సరం జూన్‌ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఈ లెక్కన మరో వారం గడిస్తే విద్యా సంవత్సరం తొలి త్రైమాసికం పూర్తయ్యేది. కానీ కోవిడ్‌–19 కారణంగా పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌/డిజిటల్‌ పద్ధతిలో పాఠ్యాంశ బోధనకు విద్యాశాఖ రూపకల్పన చేసింది. తొలుత జూన్, జూలై నెలల్లో జరగాల్సిన బోధనకు సంబంధించి వీడియో పాఠాలను స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీస్‌(ఎస్‌ఐఈటీ) ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. 

అరగంటకో పీరియడ్‌ 
డిజిటల్‌ పాఠాల బోధనకు విద్యాశాఖ ప్రత్యేక సమయాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఒక్కో పీరియడ్‌ (సెషన్‌) కనీసంగా అరగంట పాటు కొనసాగుతుంది. ఈ లెక్కన ఉన్నత తరగతులకు రోజుకు గరిష్టంగా 6 పీరియడ్లు కొనసాగుతాయి. డిజిటల్‌ పాఠాలను తెలంగాణ మోడల్‌ స్కూల్‌ సొసైటీతో పాటు ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. ఇందుకు నిపుణులకు మూడు రోజుల పాటు వెబినార్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. దూరదర్శన్‌ యాదగిరి చానల్‌లో మాత్రం రోజుకు గంటన్నర పాటు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు ప్రసారమవుతాయి. ఇందుకు 3 స్లాట్‌లను బుక్‌ చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నా రు. డిజిటల్‌ పాఠాల రూపకల్పనకు రూ.30 లక్షల వ్యయ అంచనాతో అధికారులు ప్రతిపాదించారు. దీనిని ప్రభుత్వం ఆమోదించా   ల్సి ఉంది. కాగా, ఆన్‌లైన్‌/డిజిటల్‌ పాఠాలను ఏయే తరగతులకు ఎంత సమయం పాటు బోధించాలనే దానిపై విద్యాశాఖ ఒక షెడ్యూల్‌ను కూడా రూపొందించింది. 

కాలేజీ విద్యార్థులకూ ఆన్‌లైన్‌ పాఠాలు
సాక్షి, హైదరాబాద్‌: కళాశాల విద్యార్థులకూ డిజిటల్‌/ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. డిజిటల్, టీవీ, టీశాట్‌æ మాధ్యమాల ద్వారా వీడియో పాఠాలు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు, కాలేజీ విద్య కమిషనర్, అన్ని యూనివర్సిటీలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27 నుంచే బోధన సిబ్బంది విధులకు హాజరై డిజిటల్, ఈ–లెర్నింగ్‌ ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటర్‌ సెకండియర్‌తోపాటు డిగ్రీ, పీజీ సీనియర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement