కరోనా: రాబోయే మూడు నెలలు జాగ్రత్త! | Director of Medical,Health: Covid Intensity Is High In Winter | Sakshi
Sakshi News home page

రాబోయే మూడు నెలలు జాగ్రత్త 

Published Wed, Nov 4 2020 7:58 AM | Last Updated on Wed, Nov 4 2020 9:46 AM

Director of Medical,Health: Covid‌ Intensity Is High In Winter - Sakshi

సాక్షి, ఎంజీఎం: చలికాలంలో కోవిడ్‌ తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నవంబర్‌తో పాటు డిసెంబర్, జనవరి నెలలో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్‌ బారిన పడకుండా కాపాడుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌రావు సూచించారు. చలికాలంలో కోవిడ్‌ నివారణ కోసం వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు వరంగల్‌ ఉమ్మడి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం ఆయన హన్మకొండలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. చదవండి: సెకండ్‌ వేవ్: కరోనా మార్గదర్శకాలు 

అన్నింటి లక్షణాలు ఒక్కటే 
చలికాలంలో ప్లూ ద్యారా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కోవిడ్‌ను పోలి ఉంటాయని శ్రీనివాసరావు తెలిపారు. దీంతో వ్యాధి నిర్దారణ కోసం కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరి అని చెప్పారు. ఈ క్రమంలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ కూడా ఉచిత కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందనే అంశంపై స్పష్టత లేకపోగా, వ్యాక్సిన్‌తో వంద శాతం రక్షణ ఉంటుందా, లేదా అనేది కూడా తెలియడం లేదని చెప్పారు. ఈ మేరకు ప్రజలే స్వీయ రక్షణ కోసం మాస్క్‌ ధరించడం, ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడంతో పాటు నిత్యం చేతులను శుభ్రం చేసుకుంటూ సమూహాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదవండి: పీఎఫ్‌ కార్యాలయాలకు రావొద్దు..

రాష్ట్రంలో నేటి వరకు నేటి వరకు 44లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 2,42,506 కేసులు నమోదయ్యాయని, ఇందులో ప్రస్తుతం 17,742 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 2,400 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. గత మూడు నెలల క్రితం వరకు ప్రతిరోజు 60వేలకు పైగా కేసులు ఉండగా, గత 45 రోజులుగా ఈ సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందని స్పష్టం చేశారు. యూరోపియన్, ప్రాన్స్, ఇంగ్లాండ్‌ వంటి దేశాలతో పాటు మన దేశంలోని కేరళ, పశ్చిమబెంగాల్‌లో కేసులు పెరిగినా, మన దగ్గర ఆ పరిస్థితి లేదని తెలిపారు. అయినప్పటికీ చలికాంలో వైరస్‌కు అనువైన కాలమైనందున జలుబు, దగ్గు, జ్వరం బారిన పడినా వైద్యులకు సలహాతోనే చికిత్స పొందాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. క

రోనా వైరస్‌ తగ్గినట్లే తగ్గుతున్నా, మళ్లీ వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని తెలిపారు. కాగా, ఈ ఏడాది అంటువ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గిందని, గత ఏడాదితో పోలిస్తే 50 శాతం కూడా నమోదు కాలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. ప్రజల్లో వచ్చిన చైతన్యమే వ్యాధుల వ్యాప్తి తగ్గుదలకు కారణమన్నారు. కోవిడ్‌ వైరస్‌ ప్రజల జీవనవిధానంలో పెనుమార్పు తీసుకవచ్చిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్‌ లలితాదేవి, మధుసూధన్, శ్రీరాం, మాస్‌ మీడియా అధికారి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement