కృష్ణా బోర్డు సమావేశంలో వాదనలు వినిపిస్తున్న తెలంగాణ జలవనరుల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఈ ఏడాది కూడా పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని ఇరు తెలుగు రాష్ట్రాలు నిర్ణయానికి వచ్చాయి. ఈసారి ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34ః66 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీ పంచుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఒప్పందానికి వచ్చాయి. కృష్ణా జలాల్లో వాటా పెంపు అంశాన్ని ట్రిబ్యునళ్లు మాత్రమే తేల్చగలవని.. తాము నిర్ణయం తీసుకోలేమన్న బోర్డు సూచన మేరకు దీనికి తెలంగాణ అంగీకరించింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రాలేదు. విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తెలంగాణ స్పష్టం చేయగా.. సాగు, తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ వాదించింది. కాగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు రజత్‌కుమార్‌కు ఫోన్ చేసి.. కృష్ణాబోర్డు సమావేశంలో జరుగుతున్న వాదనలపై ఆరా తీశారు. ఏపీ ఏయే అంశాలను లేవనెత్తుతోందన్నది తెలుసుకుని, పలు సూచనలు చేశారు.
వాడివేడిగా వాదనలు
కృష్ణాజలాల్లో వాటాలు, వినియోగం, విద్యుదుత్పత్తి సహా పలు కీలక అంశాలపై హైదరాబాద్‌లోని జలసౌధలో బుధవారం కృష్ణాబోర్డు సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశం బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మొదలైంది. తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖల కార్యదర్శులు రజత్‌కుమార్, శ్యామలారావు, ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డితోపాటు తెలంగాణ అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారు. సుమారు 7 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. తర్వాత బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అంశాల అమలుపై మరో నాలుగు గంటల పాటు సమావేశం జరిగింది. మొత్తంగా 11 గంటల పాటు సమావేశాలు జరిగాయి.
వాటాలపై తెలంగాణ పట్టు
సమావేశంలో వాటాల పెంపు అంశాన్ని తెలంగాణ ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘కృష్ణాబోర్డు 12వ భేటీలో తెలంగాణ, ఏపీ మధ్య 34ః66 నిష్పత్తిలో ఒక ఏడాదికి నీటి పంపకాలు చేయడానికి అంగీకరించాం. మైనర్ ఇరిగేషన్ వినియోగం, పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లు, ఆవిరి నష్టాలను ఈ నిష్పత్తిలో లెక్కించకూడదని నిర్ణయం తీసుకున్నాం. పరీవాహకం, సాగుయోగ్య భూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా ఆధారంగా చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటా 70.8ః 29.2 శాతంగా ఉండాలి. కనీసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు కృష్ణా జలాల్లో లభ్యత నీటిని 50ః50 నిష్పత్తిన పంచాలి’’ అని తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ వాదించారు.
పోలవరం మళ్లింపు వాటాల ప్రకారం సైతం తమకు 45 టీఎంసీలు అదనంగా దక్కుతాయని, వాటిని ఈ ఏడాది నుంచి వినియోగిస్తామని తెలిపారు. అయితే దీనిని ఏపీ వ్యతిరేకించింది. కృష్ణాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు సంబంధించి.. నాగార్జునసాగర్ ఎగువన నీటిని పంపిణీ చేసే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఉందని ఏపీ సెక్రటరీ శ్యామలారావు వాదించారు. నిజానికి ప్రస్తుత వాటాలను సవరిస్తే ఏపీకే 70 శాతం నీటిని ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కల్పించుకున్న బోర్డు.. నీటి వాటాల అంశం బోర్డులు తేల్చే పనికాదని, ట్రిబ్యునల్‌లో విషయం తేలేవరకు పాత పద్ధతి ప్రకారమే నీటిని వాడుకోవాలని కోరింది. దీనికి తెలంగాణ అంగీకరించింది.
విద్యుదుత్పత్తిపై గరంగరం
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. శ్రీశైలంలో ఇష్టారీతిగా విద్యుదుత్పత్తి చేస్తున్నారని, దానిని తక్షణమే నిలిపేయాలని ఏపీ డిమాండ్ చేయగా.. అనుమతుల్లేని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను తరలించడం ఆపాలని తెలంగాణ వాదించింది. ‘‘కృష్ణా బేసిన్ అవతల ఎలాంటి అనుమతుల్లేని ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలిస్తోంది. 1976, 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందాలు, 1981లో ప్రణాళికా సంఘం అనుమతుల మేరకు ఏపీ కేవలం 15 టీఎంసీల నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు, మరో 19 టీఎంసీల నీటిని ఎస్‌ఆర్‌బీసీకి జూలై–అక్టోబర్ నెలల మధ్య తరలించుకోవచ్చు. కానీ ఏపీ అధికంగా నీటిని వాడుతోంది. ఇలా ఓవైపు అక్రమంగా నీటిని తరలిస్తూ.. మరోవైపు శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపాలని కోరడం సరికాదు.
నిజానికి శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టు..’’ అని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం తాగు, సాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ అవసరాలు లేనప్పుడే శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయాలని ఏపీ వాదించింది. కేవలం విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయడం ఏమిటని ప్రశ్నించింది. ఈ ఏడాది ఏకంగా 100 టీఎంసీలను వృధాగా సముద్రంలోకి వదిలేశారని పేర్కొంది. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ స్పందిస్తూ.. తాగు, సాగు అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. అయినా తమ సూచనలు పాటించాలని బోర్డు కోరడంతో.. తెలంగాణ అధికారులు రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
క్యారీ ఓవర్ కుదరదు
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఒక ఏడాది వాడుకోలేకపోయిన నీటిని తర్వాతి ఏడాదిలో వాడుకునేలా (క్యారీఓవర్) తమకు అనుమతి ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనను కృష్ణాబోర్డు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఏపీ వాదనలతో ఏకీభవించింది. బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్–8 ప్రకారం ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని పేర్కొంది.
‘వరద’ లెక్కలు వద్దు
బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటాల్లో పరిగణించకూడదని ఏపీ కోరగా.. బోర్డు అంగీకరించింది. అయితే తెలంగాణ విజ్ఞప్తి మేరకు.. ఎవరెవరు ఎంతమేర వరద జలాలను వాడుతున్నారో లెక్కలు చెప్పాలని సూచించింది.
బోర్డుకు మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు
గెజిట్ అంశాల అమలుపై జరిగిన చర్చ సందర్భంగా.. కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను తెలంగాణ గోదావరి బోర్డుకు సమర్పించింది. చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చనాఖా–కొరట డీపీఆర్‌లను మరో వారంలో సమర్పిస్తామని తెలిపింది. గెజిట్‌లో కొన్ని అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని.. ఏవైనా ప్రాజెక్టులకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులుగానీ, వినతులుగానీ వస్తే ఎవరు పరిష్కరిస్తారని తెలంగాణ సందేహం వ్యక్తం చేసింది. ఏపీ మాత్రం గెజిట్ అమలుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపింది. ఇక గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాల పరిశీలన కోసం రెండు బోర్డులకు సంబంధించి ఉప కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపం
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు. దీనిద్వారా విద్యుదుత్పత్తి ఆపం. తాగు, సాగు అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న సూత్రం శ్రీశైలానికి వర్తించదు. తెలంగాణకు విద్యుత్ వినియోగం ఎక్కువ. కాబట్టి ఉత్పత్తి కొనసాగిస్తాం. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నా కృష్ణాబోర్డు నిలువరించడం లేదు. ఎన్ని లేఖలు రాసినా అడ్డుకోలేకపోయింది. టెలీమెట్రీ వ్యవస్థలోనే విఫలమైంది’’
రజత్‌కుమార్, తెలంగాణ స్పెషల్ సీఎస్
Comments
Please login to add a commentAdd a comment