జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో బస్టాప్‌లో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్ బోర్డు..
హైదరాబాద్: బస్టాప్‌లు ఏర్పాటు చేసేదే బస్సులు ఆపేందుకు.. కానీ బస్టాప్‌లో బస్సులు ఆగడం వల్ల వెనక ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ ట్రాఫిక్ పోలీసులు ఆ బస్టాప్‌లో బస్సులు ఆగొద్దంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం వల్ల ప్రయాణికులు, వాహనదారుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే రోడ్డులో బస్టాప్ ఉంది. ఈ బస్టాప్‌లో గత కొన్ని సంవత్సరాలుగా బస్సులు ఆగుతుంటాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాప్‌లో బస్సులు ఆగడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ బస్టాప్‌లో బస్సులు, ఆటోలు నిలపవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో బస్సులు ఎక్కడ ఆపాలంటూ ఒక వైపు ఆర్టీసీ డ్రైవర్లు, మరోవైపు బస్సులు ఎక్కేందుకు వస్తున్న ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
కొరవడిన సమన్వయం...
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో సిగ్నళ్లకు దగ్గరగా ఉన్న బస్టాప్‌ల వద్ద సమస్య ఎదురైతే ట్రాఫిక్ పోలీసులు ముందుగా ఆయా బస్టాప్‌లను తొలగించి మరికొంత దూరంలో ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీకి సూచించాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ప్రతిపాదన చేయకుండా సంబంధిత అధికారులు బస్టాప్‌లో బస్సులు ఆపొద్దంటూ బోర్డులు పెట్టడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది.
ఇంకాస్త దూరం వెళ్లాక బస్సులు ఆపేందుకు అనువైన స్థలం కూడా లేదు. ఇక్కడ ఇరుకైన రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. నిత్యం ఫిలింనగర్, అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే వందలాది మంది ఇక్కడ బస్సు సేవలను వినియోగించుకుంటుంటారు. రెండు శాఖల అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే వీటిని ఇక్కడి నుంచి తొలగించి ప్రయాణికులకు అనువైన స్థలంలో బస్టాప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ)
Comments
Please login to add a commentAdd a comment