'రిఫర్'‌ చేస్తే లక్ష..! | Doctors And Medical Staff Doing Frauds In Corona Treatrment | Sakshi
Sakshi News home page

'రిఫర్'‌ చేస్తే లక్ష..!

Published Tue, Aug 25 2020 2:07 AM | Last Updated on Tue, Aug 25 2020 10:34 AM

Doctors And Medical Staff Doing Frauds In Corona Treatrment - Sakshi

డాక్టర్‌ జయచంద్ర (పేరు మార్చాం) హైదరాబాద్‌లో సొంతంగా క్లినిక్‌ నడుపుతున్నాడు. క్లినిక్‌కు వచ్చే కరోనా అనుమానితులకు వెంటనే పరీక్షలు చేయిస్తాడు. పాజిటివ్‌ వచ్చి, లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తాడు. అలా చేసినందుకు సంబంధిత ప్రైవేట్‌ ఆసుపత్రి ఒక్కో కేసుకు లక్ష రూపాయలు కమీషన్‌ కింద చెల్లిస్తుంది. ఇలా ఈయన ఇప్పటివరకు 150 కేసులు రిఫర్‌ చేసి, కోటిన్నర రూపాయలు మూటగట్టుకున్నాడు.

వరంగల్‌ నగరంలో డాక్టర్‌ శ్రీనివాస్‌ (పేరు మార్చాం) నడిపే నర్సింగ్‌ హోంకు కరోనా చికిత్సచేసే అనుమతి లేదు. అయితే తన వద్దకు కరోనా అనుమానిత లక్షణాలతో ఎవరైనా వస్తే, తన వద్ద ఉన్న సీటీ స్కాన్‌తో కరోనా నిర్ధారణ పరీక్ష చేస్తాడు. పెద్దగా లక్షణాలు లేకున్నా.. పాజిటివ్‌ వస్తే చాలు సీరియస్‌గా ఉందంటూ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తాడు. ఇలా చేసినందుకు అతనికి ఇప్పటివరకు దాదాపు కోటి రూపాయల వరకు ముట్టాయి.

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులతో కొం దరు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆడుకుంటు న్నారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ మొదలు డాక్టర్ల వరకు పలువురు కరోనా కేసుల పేరుతో అంది నకాడికి దండుకుంటున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖకు ఫిర్యాదులందాయి. ‘కరోనా పాజిటివ్‌’ పేరుతో బాధితుల భయాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు నడిపే కొందరు డాక్టర్లు పలు ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులతో ముందే ఒప్పందం కుదుర్చుకుని, తమ వద్దకు వచ్చే అనుమానిత కేసుల్ని రిఫర్‌ చేసి.. కేసుకు లక్ష రూపాయల చొప్పున కమీషన్‌గా అందుకుంటున్నారు. ఇటీవల జనగామలో ప్రభుత్వ డాక్టరే అక్ర మంగా అర్ధరాత్రుల్లో టెస్టులుచేసి హైదరా బాద్‌కు రిఫర్‌ చేస్తుండగా ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

‘రిఫరెన్స్‌’లకు రిజర్వుడ్‌ పడకలు
రాష్ట్రంలో 170 ప్రైవేట్, కార్పొరేట్‌ సహా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు చేస్తున్నారు. వీటిలో కరోనా పడకలు 9,058 ఉండగా, అందులో 4,061 పడకలు నిండిపోయాయి. ఇంకా 4,997 పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1,786 ఐసీయూ పడకలకు 1,039, 4,003 ఆక్సిజన్‌ పడకలకు 2,115 ఖాళీగా ఉన్నాయి. అయితే పేరొందిన ఆసుపత్రుల్లో మాత్రం పడకలు ఖాళీగా ఉండట్లేదు. చాలామంది బాధితులు పేరున్న ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని భావిస్తు న్నారు. దీంతో వాటిలో ఖాళీ పడకలు తక్కువే ఉంటున్నాయి. అయితే పేరొందిన ఆసుపత్రు లకు పంపాలంటే రిఫరెన్స్‌ తప్పనిసరి కావడంతో దీన్నే కొందరు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు.

వారు ఎప్పుడు రోగిని పంపినా అవసరమైన బెడ్స్‌ను ఆయా ప్రముఖ ఆసుపత్రులు రిజర్వుడ్‌లో పెడుతున్నాయి. ఇక కొన్ని చిన్న ఆసుపత్రుల తోనూ కొందరు డాక్టర్లు, ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లు ఒప్పందం చేసుకుంటున్నారు. వాటిలో ఖాళీలు అధికంగా ఉండటంతో ఆయా ఆసుపత్రుల పీఆర్వోలు జిల్లాల్లో ఉండే ఆసుపత్రులతో మాట్లాడి రోగులను తెప్పించుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి అక్కడా లక్ష రూపాయల వరకు కమీషన్‌ ముట్టజెపుతున్నారు. కొందరు డాక్టర్లు, ఇతర సిబ్బంది అయితే అటు ఆసుపత్రుల వద్ద, ఇటు రోగుల వద్ద రెండువైపులా గుంజుతున్నారు. కొందరు అంబులెన్స్‌ డ్రైవర్లు కూడా ఒక్కో కేసుకు రూ.30,000 నుంచి రూ.50,000 వరకు గుంజుతున్నారు. 

ఆస్తులమ్ముకుంటున్న బాధితులు
ఇలా ‘రిఫర్‌’గా వస్తున్న కేసుల్లోని బాధితుల్ని కొన్ని ఆసుపత్రులు నిండా పిండుతున్నాయి. ఆసుపత్రి స్థాయిని బట్టి రోజుకు లక్ష, వెంటలేటర్‌పై ఉంటే లక్షన్నర, సాధారణ బెడ్‌పై ఉంచినా రూ.75 వేల చొప్పున గుంజుతున్నాయి. ఈ క్రమంలో బాధితులు ఆస్తులమ్ముకుంటున్నారు. ఇంకొందరు బంగారం, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెడుతుండగా, మరికొందరు అప్పులు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల ఈ దందాపై బాధితుల నుంచి వైద్య, ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement