నేనే నంబర్‌ వన్‌  | Dominance Fight between higher education council VCs Telangana | Sakshi
Sakshi News home page

నేనే నంబర్‌ వన్‌ 

Published Fri, Sep 8 2023 12:53 AM | Last Updated on Fri, Sep 8 2023 12:53 AM

Dominance Fight between higher education council VCs Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యా మండలిలో ఇద్దరు వైస్‌ చైర్మన్ల (వీసీలు) మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఎవరు వీసీ–1 అనే దానిపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ వివాదానికి విద్యాశాఖ కార్యదర్శి కారణమనే ఆరోపణలు మండలి వర్గాల నుంచి వినిపిస్తుండగా, దీనిపై ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మండలి చైర్మన్‌ తలపట్టుకుంటున్నారు. ఉన్నత విద్యామండలిలో ఉన్నతస్థాయిలో చైర్మన్, రెండు వైస్‌చైర్మన్‌ పోస్టులున్నాయి.

చైర్మన్‌గా ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి పదవీ కాలం ముగిసే నాటికి, ప్రస్తుత చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి వైస్‌ చాన్స్‌లర్‌–1గా ఉన్నారు. రెండో వీసీగా ప్రొఫె సర్‌ వెంకటరమణ కొనసాగుతున్నారు. పాపిరెడ్డి వైదొలగిన తర్వాత లింబాద్రి తాత్కాలిక చైర్మన్‌గా, వీసీ–1గా కొనసాగారు. అయితే ఈ ఏడాది లింబాద్రిని శాశ్వత చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఇదే సమయంలో వీసీగా మహమూద్‌ను ప్రభుత్వం నియమించింది. తనను వీసీ–1గా చైర్మన్‌ చెప్పారని, అప్పట్నుంచీ వీసీ–1గానే ఫైళ్లపై సంతకాలు చేస్తున్నానని మహమూద్‌ చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వెంకటరమణను వీసీ–1గా మారుస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జూలై 24న ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత ఇద్దరు వీసీల మధ్య వివాదం మొదలైంది. వీసీ–1గా 60 ఫైళ్లపై తాను సంతకాలు చేశానని, మండలి చైర్మన్‌ను సంప్రదించకుండానే వెంకటరమణను వీసీ–1గా నియమించడం అన్యాయమంటూ మహమూద్‌ అభ్యంతరం లేవనెత్తారు. విద్యా శాఖ మంత్రికి, గవర్నర్‌కు చెప్పకుండా ఇలా చేయడం వెనుక వెంకటరమణ లాబీయింగ్‌ ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.  

‘దోస్త్‌’అజమాయిషీ అంతా వీసీ–1దే 
నిబంధనల ప్రకారం వీసీ–1గా ఉండేవాళ్లే దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు) కన్వీనర్‌గా కొనసాగుతారు. అయితే ప్రొఫెసర్‌ వెంటకరమణ బాసర ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి వీసీగా కూడా కొనసాగుతు న్నారు. ఈ పని ఒత్తిడి వల్ల కీలకమైన దోస్త్‌ బాధ్యతలను ఎవరికీ అప్పగించకుండా ఇప్పటివరకూ లింబాద్రే చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవే టు డిగ్రీ కాలేజీలపై దోస్త్‌ కన్వీనర్‌కు పూర్తి ఆజమాయిషీ ఉంటుంది. కాలేజీలకు అనుమతి మొదలు కొని, సీట్ల పెంపు, తగ్గింపు తదితర వ్యవహారాలు ఆయనే చూస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉండబట్టే వీసీ–1 స్థానం కోసం వెంకటరమణ లాబీయింగ్‌ చేశారనే చర్చ మండలి వర్గాల్లో జరుగుతోంది.  

చైర్మన్‌దే నియామక అధికారం? 
వాస్తవానికి ఇద్దరు వీసీలున్నప్పుడు ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది మండలి చైర్మన్‌ నిర్ణయించాల్సి ఉంటుంది. కాగా మహమూద్‌ను వీసీగా నియమించినా ఆయన వీసీ వన్నా, వీసీ టూనా అనేది నియామక పత్రంలో చెప్పలేదని, ఇదే సమస్యకు కారణమైందని చెబుతున్నారు. ఒకవేళ వీసీ–1గా వెంకటరమణకు బాధ్యతలు ఇచ్చేముందు కార్యదర్శి దీనిపై చర్చించినా సమస్య తలెత్తేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ విషయంపై స్పందించేందుకు వీసీ వెంకటరమణ నిరాకరించారు.  

నాకు వీసీ–1 అని చెప్పారు 
నేను బాధ్యతలు తీసుకున్నప్పుడే వీసీ–1 అని మండలి చైర్మన్‌ తెలిపారు. ఈ హోదాలోనే 60 ఫైళ్ళపై సంతకాలు చేశా. హోదా మార్చేటప్పుడు చైర్మన్‌ అనుమతి తీసుకోవాలి. విద్యామంత్రికి చెప్పాలి. గవర్నర్‌కు తెలియజేయాలి. ఇవేవీ లేకుండా విద్యాశాఖ కార్యదర్శి ఎవరో చెప్పిన మాట విని హోదా మార్చారు.  
– ప్రొఫెసర్‌ మహమూద్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement