
సుభాష్ నగర్ : మొతాదుకు మించి నిద్ర మాత్రలు వేసుకున్న ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో కారు నడుపుతూ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుండ్ల పోచంపల్లికి చెందిన అంబు సోమశేఖర్ గురువారం రాత్రి అతివేగంగా కారు నడుపుతూ జగద్గిరిగుట్ట పోలీస్ అవుట్ పోస్ట్ రోడ్డులో ప్రయాణికులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆపకుండా అతను షాపూర్‌నగర్ లోని డీసీపీ కార్యాలయం ఎదుట మరి కొందరిని ఢీకొట్టాడు.
దీంతో స్థానికులు కారును వెంబడించి ఆపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనిని గుర్తించిన జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై సందీప్ అతడిని వెంబడించి సూరారంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు వ్యక్తి మత్తులో ఉండి తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉండటంతో అతడిని సూరారం పోలీసులకు అప్పగించారు.
వివరాలు సేకరించిన పోలీసులు అతడిని గుండ్ల పోచంపల్లికి చెందిన అంబు సోమశేఖర్ గుర్తించి అతడి భార్య డాక్టర్ సువర్ణకు సమాచారం అందించారు. తన భర్త వ్యాపార పని నిమిత్తం వివేకానంద నగర్‌కు వెళ్లాడని, అప్పుడప్పుడు మోతాదుకు మించి స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకోవడంతో తను ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉంటాడని తెలిపింది. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment