
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నట్టుగా కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ తమిళిసై.. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీంతో ఆమె ప్రెస్‌మీట్ చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. గవర్నర్‌లో విభేదాల విషయంతో ప్రభుత్వం స్పందించింది. తాజాగా గవర్నర్‌ను కలిసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ క్రమంలో గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వగానే రాజ్‌భవన్‌కు వెళ్తామని విద్యాశాఖ మంత్రి, అధికారులు స్పష్టం చేశారు.
ఇక, అంతకుముందు.. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసిన విషయం తెలిసిందే. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు.