నిర్లక్ష్యం.. ప్రాణాంతకం! | Even During Corona Period Some Doctors Were Acting Negligently | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం.. ప్రాణాంతకం!

Published Sun, Aug 30 2020 1:32 AM | Last Updated on Sun, Aug 30 2020 1:32 AM

Even During Corona Period Some Doctors Were Acting Negligently - Sakshi

అతని పేరు సురేష్‌ (పేరు మార్చాం)... ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగి. 15 రోజుల క్రితం 101 నుంచి 102 ఫారిన్‌ హీట్‌ జ్వరం వచ్చింది. సమీపంలోని ప్రైవేట్‌ డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. ప్రస్తుతం సీజన్‌ కదా సాధారణ వైరల్‌ ఫీవరేనని, పారాసిటమాల్‌ మాత్రలు వాడమన్నాడు. నాలుగైదు రోజులు వాడినా జ్వరం తగ్గకపోగా దగ్గు తోడైంది. దీంతో అతని కుటుంబసభ్యులు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించారు. పాజిటివ్‌ అని తేలింది. ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్‌ అయినట్లు సీటీస్కాన్‌ లో తేలింది. అతని రక్తంలో ఆక్సిజన్‌  స్థాయి తగ్గి ఆయాసం ఎక్కువైంది. అప్పటికప్పుడు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతని ఇంట్లో అందరికీ పాజిటివ్‌ వచ్చింది. 

సంగారెడ్డి జిల్లాకు చెందిన శరత్‌ (పేరు మార్చాం) ప్రైవేట్‌ ఉద్యోగి. 35 ఏళ్ల ఇతనికి 20 రోజుల కిందట అధిక జ్వరం వచ్చింది. తెలిసిన డాక్టర్‌ వద్దకు వెళ్లగా.. సాధారణ వైరల్‌ ఫీవర్‌ అని చెప్పి మాత్రలు ఇచ్చాడు. ఐదారు రోజులైనా జ్వరం తగ్గలేదు. ఒకరోజు రాత్రి తీవ్ర ఆయాసం వచ్చింది. ఆక్సి జన్‌  స్థాయి పడిపోయింది. అప్పటి కప్పుడు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. తర్వాత ఆ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంతేకాదు ఆ కుటుంబం రోడ్డున పడింది.

సాక్షి, హైదరాబాద్‌: ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా అనేక జిల్లాల్లో నమోదవు తున్నాయి. కొందరు సీనియర్‌ డాక్టర్లు, మరికొం దరు శిక్షణలేని ప్రాక్టీషనర్ల నిర్లక్ష్యం.. అమాయక ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. సాధారణ మాత్రలతో తగ్గాల్సిన కరోనా సీరియస్‌ పరిస్థితికి చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు కూడా కరోనా పోరాటంలో ఓడిపోతున్నారు. ఏం కాదులే.. రెండు, మూడ్రోజులు చూద్దాం.. లేకుంటే తదుపరి పరీక్షలు చేద్దాం.. అని కొందరు వైద్యులు నానబెడుతున్నారు. దీంతో బాధితులకు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. 

జ్వరమొస్తే పారసిటమాల్, దగ్గు వస్తే సిరప్‌...
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై జ్వరమొచ్చినా, అనుమానిత లక్షణాలున్నా తక్షణమే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని పదే పదే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే.. లక్షణాలు లేకున్నా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తోంది. ఆ మేరకు ప్రభుత్వం రాష్ట్రంలోని 1,100 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. రోజుకు 60 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నారు. అయినా కొందరు వైద్యులు మాత్రం మారడంలేదు. జ్వరం వచ్చిందా పారసిటమాల్‌ వెయ్యి... దగ్గు వచ్చిందా ఫలానా సిరప్‌ తాగు... జలుబు చేసిందా ఇదిగో మాత్ర... ఒళ్లు నొప్పులంటే సీజన్‌ లో ఇలాగే ఉంటుంది...అంటూ  సాదాసీదాగా చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం బాధితులను ప్రాణాల మీదకు తీసుకురావడమే గాక, కరోనా కుటుంబంలో ఉన్న వారందరికీ సోకేలా చేస్తోంది. ఇదిలావుంటే చాలామంది బాధితులు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటే భయపడుతున్నారు. ‘కరోనా పరీక్ష అంటే హడలిపోతున్నారు. పాజిటివ్‌ వస్తే అందరూ వెలివేస్తారేమో అన్న భయం వారిని వెంటాడుతోందని’ ఒక వైద్యాధికారి అభిప్రాయపడ్డారు. 

ఇంటింటి సర్వేలెక్కడ?
ప్రతీ ఇంటికీ వెళ్లి జ్వర నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా చాలాచోట్ల అది అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో బాధితులను గుర్తించడం సాధ్యంకావడంలేదు. అనేకమంది ప్రైౖవేట్‌ క్లినిక్‌లకు వెళుతున్నారు. అంతేకాదు ప్రతీ ప్రైౖవేట్‌ క్లినిక్‌లలో జ్వరం కౌంటర్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. పైగా జ్వరం సహా ఇతరత్రా లక్షణాలుంటే పై ఆసుపత్రికి రిఫర్‌ చేయడంలో, యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం జరుగుతోంది. పైగా ప్రైౖవేట్‌ క్లినిక్‌లు, ప్రాక్టీషనర్లపై స్థానిక వైద్య,ఆరోగ్య యంత్రాంగం పర్యవేక్షణ కరువైంది. జిల్లాల్లో పర్యటించాలని, పరిస్థితిని పర్యవేక్షించి సూచనలు ఇచ్చి రావాలని రాష్ట్ర వైద్య యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశించినా ఎవరూ హైదరాబాద్‌ నుంచి కదలడంలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాల్లో ఏం జరుగుతుందో కూడా సమాచారం రావడం లేదు. ఇక జిల్లాల్లో ప్రైవేట్‌ డాక్టర్లు, ప్రాక్టీషనర్లకు కరోనాపై ప్రత్యేక శిక్షణ ఇవ్వకపోవడం ప్రధాన లోపంగా చెబుతున్నారు. దీంతో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు వైద్యం చేసుకుంటూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా బాధ్యులు అవుతున్నారు. బాధితుడి పరిస్థితి సీరియస్‌ అయ్యాక పై ఆసుపత్రికి వెళ్లడంటూ చిన్నపాటి రిఫరెన్స్‌లు ఇస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement