
సిరొంచ తహసీల్దార్ కార్యాలయం వద్ద మాట్లాడుతున్న రైతులు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డలోని లక్ష్మీబ్యారేజీ బ్యాక్ వాటర్‌తో తమ పంట భూములు మూడేళ్లుగా ముంపునకు గురవుతున్నాయని మహారాష్ట్రలోని సిరొంచ తాలూకాలోని 12 గ్రామాల రైతులు ఈ నెల 7నుంచి నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. సిరొంచ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టనున్నామని రైతు నేతలు సూరజ్ దూదివార్, రాము రంగువార్‌లు తెలిపారు.
శుక్రవారం వారు అక్కడి విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మహారాష్ట్ర రైతుల విలువైన పంట భూముల్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొని ఎకరానికి రూ.10.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు తెలిపారు. అప్పుడు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వే చేసిన పంట భూముల కన్నా ప్రస్తుతం ఎక్కువగా నీట మునిగి తీవ్ర నష్టం ఏర్పడుతోందని పేర్కొన్నారు. తాజాగా ముంపు భూముల రైతులకు రూ.3 లక్షలే ఇస్తామంటున్నారని, తమకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.