
బహదూర్‌పురా జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ పనుల్ని పరిశీలిస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఐటీ కారిడార్లున్న, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లు.. ఐటీ తదితర సంస్థలున్న ఉప్పల్ జోన్, కోర్‌సిటీలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో ఎస్సార్‌డీపీ కింద పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతమైన చార్మినార్ జోన్‌వైపు దృష్టి సారించింది. ఇటీవలే డాక్టర్ అబ్దుల్‌కలాం ఫ్లై ఓవర్ వినియోగంలోకి రాగా.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు నుంచి కోర్‌సిటీలోకి రాకపోకలు సాగించేవారికి ఉపకరించే రెండు ఫ్లైఓవర్లు త్వరలో పూర్తి కానున్నాయి.
వీటిలో ఆరాంఘర్– జూపార్క్ ఫ్లై ఓవర్ వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‌డీపీ)లో భాగంగా జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు నిర్మించిన అన్ని ఫ్లై ఓవర్లకంటే పెద్దది. ఇటీవలే ప్రారంభమైన షేక్‌పేట ఫ్లై ఓవర్ (పొడవు 2.71 కి.మీ.) కంటే కూడా ఇదే పెద్దది. దీని పొడవు దాదాపు 4 కి.మీ. బహదూర్‌పురా జంక్షన్ వద్ద మరో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఈ రెండూ వినియోగంలోకి వస్తే విమానాశ్రయం వెళ్లే వారితోపాటు మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి, జూపార్క్ సందర్శకులకు, పాతబస్తీ ప్రజలకు సమయం కలిసి వస్తుంది. రెండింటికీ అయ్యే ఖర్చు దాదాపు రూ. 706 కోట్లు.
సీఎస్ సోమేశ్‌కుమార్ తనిఖీ
► రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణాల్ని వేగవంతం చేసి, నిర్ణీత వ్యవధి కంటే ముందే పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బహదూర్‌పురా జంక్షన్‌లోని నిర్మాణ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
► ఆరాంఘర్– జూపార్కు ఫ్లై ఓవర్ పనుల్ని కూడా వీలైనంత త్వరితంగా పూర్తిచేయాలనగా వచ్చే సంవత్సరం మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆస్తుల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని సీఎస్ దృష్టికి తేగా.. ఫ్లై ఓవర్ మౌలిక డిజైనింగ్‌కు అంతరాయం కలుగకుండా సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తుల్లో కొన్నింటిని మినహాయించాల్సిందిగా సూచించారు.
► సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
బహదూర్‌పురా జంక్షన్ ఫ్లై ఓవర్
► అంచనా వ్యయం: రూ.69 కోట్లు
► పొడవు: 690 మీటర్లు
► లేన్లు: 6(రెండు వైపులా ప్రయాణం)
► వెడల్పు: 24 మీటర్లు
► ఇరవయ్యేళ్లకు పెరిగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. బహదూర్‌పురా జంక్షన్ వద్ద ప్రస్తుతమున్న ట్రాఫిక్ చిక్కులు ఉండవు. సిగ్నల్ ఫ్రీగా సాగిపోవచ్చు.
► దాదాపు 70 శాతం పనులు పూర్తయిన ఈ ఫ్లైఓవర్ ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది.
ఆరాంఘర్– జూపార్కు ఫ్లైఓవర్
► అంచనా వ్యయం: రూ.636.80 కోట్లు
► పొడవు: 4.04 కి.మీ.
► లేన్లు: 6 (రెండు వైపులా ప్రయాణం)
► వెడల్పు: 24 మీటర్లు
► 2037 నాటికి రద్దీ సమయంలో 5210 వాహనాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు.
► ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న ట్రాఫిక్ సిగ్నళ్లు తాడ్‌బన్, దానమ్మహట్స్, హసన్‌నగర్ జంక్షన్ల వద్ద ఎక్కడా ఆగకుండా నేరుగా రయ్‌మని వెళ్లిపోవచ్చు.
► తద్వారా ప్రయాణ సమయం తగ్గడంతోపాటు లూబ్రికెంట్స్, ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు కాలుష్యం తగ్గి, ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. వచ్చే సంవత్సరం దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment