ప్రణీత్‌రావు సస్పెండ్ కాగానే ఎస్‌ఐబీ మాజీ చీఫ్ అప్రమత్తం
ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసుల అనుమానం
మాజీ డీఎస్పీ కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం
2018 నుంచే మొదలైన అక్రమ ట్యాపింగ్ దందా
ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక ఉపకరణాలు ఖరీదు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచే నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్‌రావు.. అతని పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోపక్క సిట్ అధికారులు ప్రణీత్ రావును ఐదో రోజైన గురువారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరో నలుగురు పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వీళ్లు గతంలో ‘ప్రభాకర్‌రావు సైన్యం’లో కీలక సభ్యులని సమాచారం.
హోదా ఏదైనా బాధ్యత మాత్రం చీఫే
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్‌ఐబీకి డీఐ జీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించింది. హోదా ఏదైనా ఎస్‌ఐబీ చీఫ్‌గానే కొనసాగారు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్‌రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
గత ఎన్నికల నేపథ్యంలోనే అడ్డదారి
ఎస్‌ఐబీలో 2017 వరకు లీగల్ ఇంటర్‌సెప్షన్ (ఎల్‌ఐ)గా పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్‌రావు, అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకులు.. అక్రమ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టారు.
అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేర్వేరు నంబర్లతో సంప్రదింపులు జరుపుతుండటంతో ప్రభాకర్‌రావు బృందం రష్యా, ఇజ్రాయెల్‌లో పర్యటించి వచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక ట్యా పింగ్, ఇతర నిఘా పరికరాలను పరిశీలించి వచ్చింది. ఏవేవి ఖరీదు చేయాలో చెప్పాల్సిందిగా పేర్కొంటూ కొందరు పెద్దలకు నివేదిక సమర్పించింది.
కొనుగోలులో కీలక పాత్ర పోషించిన రవి పాల్
టెక్నికల్ అనుభవం ఉన్న రవి పాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్, అడ్వైజర్‌గా పని చేశారు. ప్రభాకర్‌రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. రవి పాల్ సూచనల మేరకు ప్రభాకర్‌రావు ఇజ్రాయెల్ నుంచి సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే అక్రమ ట్యాపింగ్ పరికరం ఖరీదు చేశారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకుని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది.
‘ఆదిలాబాద్’కోసం వినియోగించారు
2018లో ఆదిలాబాద్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతారణం నెలకొన్న సమయంలోనూ ఎస్‌ఐబీ అధికారులు ఈ బ్రీఫ్‌కేస్ ఉపకరణాన్ని వినియోగించారు. రెండు వర్గాలకు చెందిన కీలక నేతలు ఇద్దరిని పట్టుకోగలిగారు. ఈ వ్యవహారాల్లో ప్రణీత్ రావుకు కుడిభుజంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులను సిట్ గుర్తించింది. వీరిలో ఇద్దరి నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేయగా.. మరో నలుగురికి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment