సాక్షి, హైదరాబాద్: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మార్కెట్ తరలింపుపై సర్కారు మెట్టు దిగకపోవడం.. తరలించే అంశంపై కమీషన్ ఏజెంట్లు బెట్టు వీడకపోవడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు మార్కెట్‌కు తాళం పడడంతో పండ్ల క్రయ విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. గత నెల 25న మార్కెట్ బంద్ కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పండ్ల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో పండ్ల ధరలు పెరిగిపోయాయి. కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బాటసింగారంలో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టింది. ఈ మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచి అక్కడ మార్కెట్ కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంది.
అయితే, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉన్నపళంగా మార్కెట్‌ను మార్చడాన్ని తప్పుబడుతూ కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. కమీషన్ ఏజెంట్ల వాదనను ఆలకించిన న్యాయస్థానం.. సౌకర్యాల కల్పనపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిటీ నివేదిక మేరకు ఈ నెల 18వ తేదీ వరకు మార్కెట్‌ను గడ్డిఅన్నారంలోనే కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ మార్కెట్‌ను ప్రారంభిస్తారని కమీషన్ ఏజెంట్లు ఆశించినప్పటికీ, ప్రభుత్వం మాత్రం మెట్టు దిగకపోగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. తాముకూడా కేవియట్ దాఖలు చేసినట్లు కమీషన్ ఏజెంట్ల ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
దసరా తరువాతే విచారణ
గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపుపై దసరా సెలవుల అనంతరం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. మార్కెట్ తరలింపును అక్టోబర్ 18 వరకూ నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం విచారించాలని జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు. అయితే అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం, దసరా సెలవుల అనంతరం విచారిస్తామని పేర్కొంది. (చదవండి.. పారిశ్రామిక రంగంలో అద్భుతాలు: సీఎం కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment