
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కాళోజీ సెంటర్(జనగామ) : విద్యాశాఖలో ఖాళీగా ఉన్న గల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(జీసీడీఓ) పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన తొమ్మిది సంవత్సరాల క్రితం భర్తీ చేసి వారి సేవలను వినియోగించుకున్నారు. ఇప్పుడు వారి సేవలు చాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు తొలగిస్తునట్లు మార్చి 29న ఉత్తర్వులు జారీ చేయడంతో వారు రోడ్డున పడ్డారు. ఆర్‌సీ నంబర్ 435/ఆర్‌బీఎం/ఎస్‌ఎస్‌ఏ/బీఏ/2012 జూలై 7న విడదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఎంట్రన్స్ ద్వారా ఎంఏ, బీఎడ్ పూర్తి చేసి, ఏదైనా ఎన్జీఓలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతినిచ్చి ఇంటర్వూలు నిర్వహించి భర్తీ చేశారు. అందులో అర్హత సాధించిన 20 మందికి జీసీడీఓలుగా మరి కొంత మందికి ఏజీసీడీఓలుగా అవకాశం కల్పించారు. ఇటీవల జీసీడీఓల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి అప్పటికే పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి జీసీడీఓలు కొనసాగాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనితోపాటు ఇంత కాలం జీసీడీఓలుగా పనిచేసిన వారిని తొలగిస్తూ.. ఉత్తర్వులు రావడంతో ఉపాధి కోల్పోయి దిక్కుతోచన పరిస్థితిలో పడిపోయారు.
కోర్టు సానుకూలత..
ఈ తొమ్మిది ఏండ్లలో జీసీడీఓ హోదాలో పనిచేయించుకొని ఒకసారిగా మీ సేవలు ఇక చాలు అని ఉత్తర్వులు జారీచేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిని కోర్టు వారి సేవలను కొనసాగించుకోవాలని చెప్పింది. కానీ, అధికా రుల అందకు సానుకూలంగా లేరని తెలిసింది.
మించిపోయిన వయోపరిమితి..
ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే వయోపరిమితి 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు తప్పనిసరి. వ యోపరిమితి దాటితే ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అనర్హులు. 9 సంవత్సరాల కాలం విద్యాశాఖ లో జీసీడీఓలుగా పనిచేసిన వారిని ప్రభుత్వం తొలగించడంతో వయస్సు దాటిపోయి మరో ఉద్యోగాని కి నోచుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిని తొలగించి వారి స్థానంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ స్కూల్ అసిసెట్లకు ఆ బాధ్యతలను అప్పగించారు.
ఉపాధి కూలీగా పోయే పరిస్థితి..
ప్రభుత్వం 2012లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మెరిట్ ఆధారంగా మమ్మల్ని జీసీడీఓలుగా తీసుకున్నారు. 9 ఏండ్లుగా సేవలు అందిస్తున్న క్రమంలో సడన్‌గా మీరు అవసరం లేదని తొలిగించడం బాధాకరం. ఇప్పుడు ఎటుగాని పరిస్థితి ఉంది. ఉపాధి కూలీ పనులే దిక్కయ్యేలా ఉన్నాయి.
– వై.సంపత్, వరంగల్ రూరల్ జిల్లా
క్రమబద్ధీకరిస్తామంటే నమ్మినం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగలును క్రమబద్ధీకరణ చేస్తానని ప్రకటించడంతో ఇంత కాలం నమ్మి పనిచేసినం. ఇప్పుడు ఎటుగాకుండా చేసి వెల్లగొట్టారు. ఇది ఎంతవరకు సమంజసం. ప్రభుత్వం పునరాలోచన చేసి, తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రద్దుచేయాలి.
– బండారు విజయ్‌కుమార్, మహబూబాబాద్