సాక్షి, హైదరాబాద్ః రాష్ట్ర మంత్రి మండలిలో కేబినెట్ బెర్త్‌తో పాటు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. శాసనసభ ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉండటంతో ఖాళీగా ఉన్న కేబినెట్ మంత్రి పదవిపై కన్నేసిన ఆశావహులు బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టిలో పడేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, కీలక పదవుల భర్తీ ఉంటుందనే వార్తలు ఎమ్మెలు, నేతలను ఆశలపల్లకిలో విహరింపజేస్తున్నాయి.
మెదక్ జిల్లాలో రైతులకు సంబంధించిన భూ ఆక్రమణల ఆరోపణలపై ఈటల రాజేందర్‌ను 2021 మే చివరి వారంలో సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించారు. తదనంతర పరిణామాలతో ఈటల బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆయన నిర్వర్తించిన వైద్యారోగ్య శాఖ బాధ్యతలను ఆర్ధిక మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఈటలను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేసి ఏడాదిన్నర గడిచినా ఆయన స్థానంలో కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరినీ తీసుకోలేదు. సంక్రాంతి తర్వాత జనవరి చివరి వారంలో మంత్రివర్గాన్ని పాక్షికంగా పునర్వ్యస్థీకరిస్తారనే ప్రచారం జరుగుతోంది.మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్త్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులను తప్పించి కొత్తవారికి చోటు కల్పిస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పునర్వ్యవస్థీకరణలో కేబినెట్ నుంచి బయటకు వెళ్లేవారు, కొత్తగా చేరేవారు ఎవరనే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
మండలి డిప్యూటీ చైర్మన్ పోస్టు ఎవరికో..
శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌తో పాటు మరో రెండు విప్ పదవులు కూడా దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో 2022 మార్చిలో రెండో పర్యాయం మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగకపోవడంతో 2021 జూన్ నుంచి ఖాళీగానే ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ముదిరాజ్‌కు ఇంకా రెండున్నరేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆయనను ఎమ్మెల్యే కోటాలో సీఎం కేసీఆర్ శాసన మండలికి నామినేట్ చేశారు. దీంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బండా ప్రకాశ్ డిసెంబర్ 2021లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ఈటల స్థానంలో రాష్ట్ర మంత్రివర్గంలోకి లేదా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి లభిస్తుందనే ప్రచారం జరిగినా ముందుకు సాగలేదు. సుమారు ఏడాదిన్నరగా మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉండటంతో ఆశావహులు కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఖాళీగానే ప్రభుత్వ విప్ పదవులు
శాసన మండలిలో నలుగురు ప్రభుత్వ విప్‌లకు గానూ ప్రస్తుతం ఎంఎస్ ప్రభాకర్ ఒక్కరే కొనసాగుతున్నారు. బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రభుత్వ చీఫ్ విప్‌గా 2019–21 వరకు కొనసాగారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరికీ అవకాశం దక్కలేదు. మరోవైపు ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2019లో, కర్నె ప్రభాకర్ 2020లో, కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్ 2022 జనవరిలో ఎమ్మెల్సీలుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు.
కర్నె ప్రభాకర్ మినహా మిగతా ముగ్గురు మరోమారు శాసన మండలికి ఎన్నికైనా వీరిలో మళ్లీ ప్రభుత్వ విప్‌లుగా ఎవరికి అవకాశం దక్కకపోగా, సుదీర్ఘకాలంగా మండలిలో ప్రభుత్వ విప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment