సాక్షి,ధర్మపురి(కరీంనగర్): సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకోడానికి స్వగ్రామం వచ్చిన ఓ చేనేత కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం గ్రామానికి చెందిన ఆడెపు శంకరయ్య(63) చేనేత కార్మికుడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో సిరిసిల్లలో ఉంటూ పని చేస్తున్నాడు. సంక్రాంతి నేపథ్యంలో గురువారం పని ముగించుకొని, ఇంటికి వచ్చాడు. రాత్రి కటుంబసభ్యులతో ఆనందంగా గడిపాడు. శుక్రవారం బహిర్భూమికి వెళ్లి, ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. శంకరయ్య ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యలు వెతకగా బహిర్భూమి ప్రాంతంలో మృతిచెంది కనిపించాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
మరో ఘటనలో..
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నాగారపు బాలయ్య–రేనవ్వలకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నకొడుకు నాగారపు నరేశ్(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికొచ్చిన నరేశ్ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నరేశ్ బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. తంగళ్లపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment