సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ కేంద్రం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీకి అనుగుణంగా కేంద్రం నిర్దేశించిన పరిమితుల మేరకే అప్పులున్నాయని స్పష్టం చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో.. అప్పుల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉందని తెలిపారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని చెప్పారు. దేశ జీడీపీతో పోలిస్తే కేంద్రం అప్పులు 62.2 శాతం ఉండగా, రాష్ట్ర అప్పులు కేవలం 22.8 శాతంగానే ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో అప్పులు, వడ్డీలు కలిపి రూ.50 వేల కోట్లు ఉంటాయన్న కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలని ఖండించిన హరీశ్.. వచ్చే ఏడాది అప్పులు, వడ్డీలు కలిపి చెల్లించేది రూ.26,624 కోట్లేనని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో మంత్రి హరీశ్ సుదీర్ఘ సమాధానమిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు..
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ఆయా రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హరీశ్ చెప్పారు. ప్రభుత్వ కీలక రంగాల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణలో నిధుల కేటాయింపు తక్కువగా ఉందంటూ భట్టి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చిన మంత్రి.. శాఖల వారీగా చేసిన కేటాయింపులను వివరించారు. విద్యారంగంలో గత ఆరేళ్లలో 14.15 శాతం నిధుల వెచ్చింపు జరగ్గా, వ్యవసాయ రంగంలో 11.4 శాతం, విద్యుత్ రంగంలో 7.3 శాతం, ఇరిగేషన్ రంగంలో 8.4 శాతం, హౌసింగ్‌లో 1.8 శాతం మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జాతీయ సగటు కన్నా ఎక్కువగానే నిధుల ఖర్చు జరుగుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం సైతం జాతీయ సగటు కన్నా రెట్టింపు ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందంటూ భట్టి సభను తప్పుదారి పట్టించారని, అయితే సీఎంఐఈ సర్వే ప్రకారం 2019–20లో జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగం 7.63 శాతమైతే.. తెలంగాణలో 4.53 శాతంగా ఉందన్నారు. 2020–21లో జాతీయ సగటు 10.35 శాతం కాగా, తెలంగాణలో 6.15 శాతంగా ఉందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్, బీజేపీలు అమ్ముతూ పోతుంటే, ఆర్టీసీ, విజయ డెయిరీ వంటి సంస్థలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ రాష్ట్రం నమ్మకం కలిగిస్తోందని వెల్లడించారు.
నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఇవ్వలేదు..
ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని హరీశ్ ప్రస్తావించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం 30 రోజుల్లో ఇస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎక్కడ, ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలని సూచించారు. ‘మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. 13వ ఆర్థిక సంఘం నుంచి ఆరేళ్లుగా రూ.1,129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రెండేళ్లుగా రూ.817 కోట్లు రాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న వెనకబడిన ప్రాంతాల నిధి కింద రూ.350 కోట్లు రాలేదు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటుగా రూ.2,350 కోట్లు ఇవ్వాలని చెప్పినా రాలేదు. మొత్తంగా కేంద్రం నుంచి రూ.28,225 కోట్లు రావాల్సి ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై మాట్లాడాలి..’అని అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుంటామని, అయితే రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోమని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment