డ్రగ్స్‌ దందాలో టీవీ చానల్‌ అధినేత | Head of TV channel Involved in Drugs Case | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ దందాలో టీవీ చానల్‌ అధినేత

Published Wed, Oct 23 2024 4:03 AM | Last Updated on Wed, Oct 23 2024 4:18 PM

Head of TV channel Involved in Drugs Case

గతంలో పలు వివాదాలు..

ఓ ‘సొసైటీ’ వ్యవహారాల్లోనూ వివాదాస్పద పాత్ర

డ్రగ్స్‌ నిందితులు, అనుమానితులతో దీర్ఘకాలంగా లింకులు 

15 మంది వినియోగదారులతో సంప్రదింపులు 

వీరిమధ్య 2,500 ఫోన్‌ కాల్స్, పదుల సంఖ్యలో ఎస్సెమ్మెస్‌లు 

పోలీసులకు చిక్కిన ఆధారాలు..ఆయన వ్యవహారాలపై నిఘా 

వారసత్వంగా అందిన చానల్‌తో మీడియా అధినేతగా మారిన వైనం

సాక్షి, హైదరాబాద్‌: ఆయనో మీడియా అధినేత.. తండ్రి స్థాపించిన టీవీ చానల్‌ నిర్వహణ పగ్గాలు వారసత్వంగా పొందారు. గతంలోనే పలు వివాదాలు ఆయన్ను చుట్టుముట్టగా, ఇటీవల ఓ ‘సొసైటీ’ వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర వివాదాస్పదమైంది. తాజాగా ఆయనకు సంబంధించిన మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు, అనుమానితులతో సదరు న్యూస్‌ చానల్‌ యజమానికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులు, అనుమానితులతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో పటిష్ట నిఘా వేసి ఉంచారు.  

కొన్నాళ్లుగా పరిశీలిస్తున్న పోలీసులు 
రాష్ట్ర పోలీసు విభాగం కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకప్పుడు ఏదైనా కేసులో దొరికిన డ్రగ్‌ పెడ్లర్‌ వద్దే దర్యాప్తు, విచారణ ఆగిపోయేది. తద్వారా మాదకద్రవ్యాల దందాకు కళ్లెం పడట్లేదని భావించిన పోలీసు విభాగం కొత్త పంథా అనుసరించడం మొదలెట్టింది. డ్రగ్స్‌ విక్రేతలు, ఖరీదు చేసే వారితో పాటు అనుమానితులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సైతం సమకూర్చుకుంది. 

ఏదైనా ఓ కేసులో డ్రగ్‌ సప్లయర్, పెడ్లర్, కన్జ్యూమర్లతో పాటు వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను ఆద్యంతం పరిశీలిస్తోంది. ఆయా వివరాలతో ప్రత్యేకంగా డేటాబేస్‌ సైతం రూపొందిస్తోంది. దాన్ని కేంద్రం ఆ«దీనంలోని క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ నెట్‌వర్క్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టంతో (సీసీటీఎన్‌ఎస్‌) అనుసంధానించింది.  

ఓ కేసు దర్యాప్తులో దొరికిన తీగ 
పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్‌ వినియోగదారుడికి సంబంధించిన కాల్‌డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరికొంత లోతుగా ఆరా తీశారు. 

దీంతో ఆయనకు ఈ డ్రగ్‌ వినియోగదారుడితో పాటు మరో రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న 14 మందితో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో డ్రగ్స్‌ వినియోగదారులతో పాటు ఆ కేసుల్లో అనుమానితులు సైతం ఉన్నారు. కొందరితో చాలా కాలంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారని తెలిసింది. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు సైతం ఉండటం గమనార్హం.  

డ్రగ్స్ కేసులో న్యూస్ ఛానల్ ఓనర్..

కదలికలపై కన్ను 
డ్రగ్స్‌ దందా చేస్తున్న వారితో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఉన్నత కుటుంబాల్లో ఈ జాఢ్యం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఈ వర్గాల్లో పెరిగిన డిమాండ్‌తోనే సింథటిక్‌ డ్రగ్స్‌ దందా జోరందుకుంటోంది. 

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఇటీవలి కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ మీడియా సంస్థ అధినేతకే మాదకద్రవ్యాల వినియోగదారుడు, ఆ కేసుల్లో అనుమానితులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు ఆ జాబితాలోని వారిపై నిఘా ఉంచడంతో పాటు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.  

2011 నుంచి సంబంధాలు 
మీడియా ఛానల్‌ అధినేతకు, మాదకద్రవ్యాల కేసుల్లో అనుమానితులు, వినియోగదారులుగా ఉన్న వారి మధ్య జరిగిన సంప్రదింపులు భారీ స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మందితో 2,500 కాల్స్‌ ఉన్నట్లు తెలిసింది. వీటిలో అత్యధికం ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కాగా ఎస్సెమ్మెస్‌ల్లో మాత్రం ఎక్కువగా ఔట్‌ గోయింగ్‌ ఉన్నాయి. 

వీరిలో కొందరితో ఆయన 2011 నుంచి సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం. వారి మధ్య వందల నిమిషాల సేపు సంప్రదింపులు జరిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండటంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement