సాక్షి,హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో రిజర్వ్‌డ్ వార్డుల్లో రొటేషన్ పద్ధతి పాటించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రొటేషన్ పద్ధతి పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి పదేళ్లు గడుస్తోందని, 2016లో ఎన్నికలు జరిగినప్పుడు మౌనంగా ఉన్నారని, ఇప్పుడు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇలా పిటిషన్ దాఖలు చేయడం ఏంటంటూ మండిపడింది.
ఈ పిటిషన్ దాఖలు చేయడం వెనుక ప్రజాప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటిషనర్ కోరిన మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రొటేషన్ పద్ధతి పాటించడంలేదని, ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన ప్రజా హిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫు న్యాయవాది కె.పవన్‌కుమార్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
ఈ మేరకు అనుమతించిన ధర్మాసనం భోజన విరామం తర్వాత విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో బడుగు, బలహీన వర్గాలైన ఎంబీసీలకు అన్యాయం జరుగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ఎంబీసీలకు అన్యాయం జరుగుతోందని భావిస్తే ఇంతకాలం పిటిషన్ దాఖలు చేయకుండా ఏం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్‌లో వచ్చే తుదితీర్పునకు లోబడి ఎన్నికల నిర్వహణ ఉండేలా ఆదేశించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
తామిచ్చే ఆదేశాలు ఐదేళ్ల తర్వాత నిర్వహించే ఎన్నికలకు మాత్రమే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ప్రతివాదులుగా ఉన్న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. ఇదే అంశానికి సంబంధించిన 2015, 2016లో దాఖలైన పిటిషన్లతో ఈ పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment