కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
ఇది సాధారణ సమస్య కాదు..
వ్యక్తుల గోప్యతలోకి చొరబడిన అంశమని వ్యాఖ్య
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మీ వివరణేంటో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని.. ఇది టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి సాధారణ సమస్య కాదని, వ్యక్తుల గోప్యతలోకి చొరబడిన అంశమని వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, హైదరాబాద్ సీపీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
సుమోటాగా విచారణ చేపట్టిన హైకోర్టు
‘ఫోన్ ట్యాపింగ్, జీపీఎస్ లొకేషన్ నుంచి వివరాలు తెలుసుకుని రేవంత్‌రెడ్డి స్నేహితుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్‌రెడ్డి నుంచి రూ.1.95 కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్నేహితుడు వేణు నుంచి రూ.3 కోట్లు, జి.వినోద్ నుంచి రూ.50 లక్షలు, ఉత్తమ్ మిత్రుల నుంచి రూ.50 లక్షలు.. ఇలా పలువురి నుంచి ఎన్నికల సమయంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తిరుపతన్న తన వాంగ్మూలంలో చెప్పారు.
హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు’అంటూ వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం మధ్యాహ్న విరామం తరువాత విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment