సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కొన్ని రాజకీయ పార్టీలు దేవుళ్లను, మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ దేవునిపై పూర్తి నమ్మకం, విశ్వాసంతో పాలన సాగిస్తున్నారని చెప్పారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు దేవుళ్ల పేర్లుపెట్టారని వివరించారు.
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచ వద్ద రూ.1,774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులకు శనివారం భూమిపూజ చేశారు. ఈ పథకం పూర్తయితే నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల పరిధిలో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. గతంలో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని, ఇందుకు భిన్నంగా ఇప్పుడు బిహార్, యూపీ, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి వ్యవసాయ కూలి పనులు చేస్తున్నారని చెప్పారు.
గతంలో కేసులు.. బెయిల్.. జైలు..
కాంగ్రెస్, టీడీపీ పాలనలో సంగారెడ్డి జిల్లా నారా యణఖేడ్ వాసుల పరిస్థితి కేసులు.. బెయిలు.. జైలు.. అన్న చందంగా ఉండేదని హరీశ్ అన్నారు. గత పాలకులు ప్రజలను ఏదో ఓ కేసులో ఇరికించి కోర్టుల చుట్టూ తిరిగేలా చేసేవారని ఆరోపించారు. స్నానం నీటిని తాంబూలంలో పట్టుకున్న గోస నారాయణఖేడ్ అంటే సాగునీరే కాదు, తాగునీటికి కూడా నోచుకోని పరిస్థితి ఉండేదని మంత్రి హరీశ్ గుర్తు చేశారు. నీళ్లు లేక చిన్నారులను మంచంపై కూర్చుండబెట్టి కింద తాంబూలం పెట్టుకుని స్నా నం చేయించిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలో ఇంటింటికీ నల్లా నీళ్లు రావడంతోపాటు, సాగునీటి కష్టాలు కూడా తీరనున్నాయన్నారు. కరువు కాటకాలతో అల్లాడిన నారాయణఖేడ్ ప్రాంతం రానున్న రోజు ల్లో మరో కోనసీమగా మారనుందని చెప్పారు. కాగా, బోరంచ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న హరీశ్‌రావు.. అమ్మవారికి ముక్కుపుడక చేయించేందుకు డబ్బులు ఇచ్చానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment