సాక్షి, హైదరాబాద్/నాగోలు: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ) కింద చేపట్టిన పనుల్లో మరో ఫ్లై ఓవర్ నేటినుంచి అందుబాటులోకి రానుంది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఒక్కోవైపు మూడు లేన్లతో ఉన్న ఈ ఫ్లైఓవర్ వినియోగంతో ఎల్‌బీనగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కావడంతోపాటు నాగోల్ చౌరస్తా వద్ద, బండ్లగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు 75 శాతం పరిష్కారం కానున్నాయని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్‌బీనగర్‌ల మీదుగా ఉప్పల్ వరకు వచ్చేవారు ఈ ఫ్లైఓవర్‌తో సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు.
ఇది 16వ ఫ్లైఓవర్..
ఎస్సార్‌డీపీ ద్వారా పూర్తయిన పనుల్లో ఇది 16వ ఫ్లైఓవర్. ఇప్పటికే 15 ఫ్లైఓవర్లతోపాటు 5 అండర్‌పాస్‌లు, 7 ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు, దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జి, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌బీనగర్ పరిసరాల్లోని నాలుగు జంక్షన్లలో రూ. 448 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మాణమైన నాగోల్ ఫ్లైఓవర్ ఇవ్వాళటి నుండి అందుబాటులోకి వస్తుంది. ఆరు లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు ఉంది. @TSMAUDOnline @GHMCOnline pic.twitter.com/a4S5UsKti4
— KTR (@KTRTRS) October 26, 2022
సులభ ప్రయాణం..
2015 సర్వే మేరకు నాగోలు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు 7,535 వాహనాలు(పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 12,648కి చేరుకోనుందని జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.దేవానంద్ తెలిపారు. సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం వల్ల వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఎస్సార్‌డీపీ అధికారులు కె. రమేష్ బాబు, రోహిణి, జీహెచ్‌ఎంసీ హయత్‌నగర్ సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్‌ఓ శ్రీనివాస్, ఎల్‌బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎల్‌బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు నాగోలు ప్లైఓవర్‌ను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment