
సాక్షి, ఖైరతాబాద్: ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహా గణపతి ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏడాదికో అడుగు పెరుగుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. ఈసారి 68వ సంవత్సం సందర్భంగా శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా 50 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. విగ్రహ తయారీ పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో రూపు దిద్దుకోనున్న మహాగణపతి నమూనాను సోమవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, వీణామాధురి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌లతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సందీప్‌రాజ్, రాజ్‌కుమార్, మహేష్‌యాదవ్, బిల్డర్ రమేష్‌లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రత్యేకతలివే..
► తొలిసారిగా 50 అడుగుల ఎత్తు మేర మట్టితో తయారుచేస్తున్న శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతి నిల్చున్న ఆకారంలో ఉంటాడు.
► పాముపై కమలం పువ్వులో నిలబడి ఉన్న మహాగణపతి పక్కనే కుడివైపు లక్ష్మీదేవి అమ్మవారు మరో పక్క మూషికం ఉంటాయి.
► అయిదు తలలపై పాము పడగ, ఆరు చేతులతో అద్బుతంగా దర్శనమిచ్చేవిధంగా డిజైన్ చేశారు.
► మహాగణపతికి కుడివైపు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి అమ్మవార్ల విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి.
► గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారయ్యే గణపతిని.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈసారి మట్టితోనే మహాగణపతిని తయారుచేస్తున్నారు.
► ఈ నెల 10న కర్రపూజ తర్వాత మహాగణపతి విగ్రహ తయారీపనులు ప్రారంభమయ్యాయి.
► మొదట ఐరన్ ఫ్రేమ్‌తో అవుట్‌లైన్ తయారు చేస్తారు. అనంతరం దానిపై గడ్డిని మట్టితో కలిపి నారలాగా తయారుచేసి ఐరన్ చుట్టూ ఔట్ లుక్ కోసం అంటిస్తారు. దానిపై టన్నుకు పైగా సుతిలి తాడును చుడతారు. దానిపై మట్టితో రూపు రేఖల్ని తీర్చి దిద్దుతారు.
► ఆ తర్వాత గాడా క్లాత్‌పై పల్చటి మట్టిని పూసి ఫినిషింగ్ పనులు పూర్తి చేసి.. వాటర్ పెయింట్స్ వేయడంతో మట్టి వినాయకుడు పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలోనూ ఇబ్బందులు తలెత్తవని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment