సాక్షి, హైదరాబాద్: చికెన్ లవర్స్‌కు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. టిఫిన్.. లంచ్.. స్నాక్స్.. డిన్నర్ సమయం ఏదైనా.. చికెన్ వంటకాలను కుమ్మేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలలో చికెన్ వాడకంలో దేశంలోనే హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో ఉంది.గ్రేటర్ జనానికి సందర్భం ఎదైనా ముక్క లేనిదే ముద్ద దిగడంలేదు. దేశరాజధాని ఢిల్లీ రెండో స్థానంలో.. ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు మూడోస్థానంలో నిలవడం విశేషం. కాగా పోషక విలువలు, ప్రొటీన్స్ అధికంగా ఉండటం.. అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండటంతో చికెన్‌కు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. కరోనా తర్వారా చికెన్ విక్రయాలు భారీగా పెరిగినా.. మటన్ వినియోగం మాత్రం అంతగా పెరగలేదని నాన్‌వెజ్ మార్కెట్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
చికెన్ వెరైటీల్లోనూ హైదరా‘బాద్‌షా’.. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న సిటీజన్లు ఆన్‌లైన్‌లోనూ తమకు నచ్చిన చికెన్ వెరైటీలను ఆర్డర్లు చేస్తున్నట్లు పలు ఫుడ్ డెలివరీ సంస్థల సర్వే ద్వారా తెలిసింది. దేశంలోని ఇతర నగరాలతో పోలీస్తే ప్రపంచ వ్యాప్తంగా లభించే వివిధ రకాల చికెన్ డిష్‌లు దాదాపు నగరంలోని అన్ని హోటల్స్‌లో లభిస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలీస్తే హైదరాబాద్ హోటల్స్‌లో చికెన్‌తో చేసిన దాదాపు ఇరవైకి పైగా వెరైటీలు లభిస్తున్నాయి. దీంతో కూడా నగర జనం వివిధ రకాల చికెన్ వెరైటీల రుచులు ఆస్వాదిస్తున్నారు. వెరైటీ చికెన్ ఆడర్స్‌లోనూ దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉందని ఫుడ్ డెలివరీ సంస్థలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఆది నుంచే భోజన ప్రియులు ఉండటంతో ఇక్కడ అందుబాటులో ఉన్న ఫుడ్ వెరైటీలు దేశంలో ఎక్కడా లేవని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
గ్రేటర్‌లో నిత్యం 6 లక్షల కిలోలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజువారి చికెన్ వినియోగం 6 లక్షల కిలోలు ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఢిల్లీ, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో వినియోగం ఎక్కువగా ఉందని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. కోవిడ్ అనంతరం గ్రేటర్‌లో రోజూ 6 లక్షల కిలోల వినియోగం ఉండగా ఢిల్లీలో 5.5 లక్షలు, బెంగళూరులో 5 లక్షల వరకు చికెన్ విక్రయాలు జరుతున్నాయని పౌల్ట్రీ రంగం అంచనా. ఇతర ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్ శివారు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ఎక్కువగా పౌల్ట్రీ ఫామ్‌లు ఉన్నాయి. ఇతర నగరాలతో గ్రేటర్‌లో చికెన్ ధరలు కూడా తక్కువే. తెలంగాణ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కోళ్ల ఎగుమతులు కూడా జరుగుతున్నాయి.
మటన్ లక్ష కేజీలు మాత్రమే..
గ్రేటర్‌లో చికెన్ విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నా మటన్ విక్రయాలు మాత్రం అంతగా లేవు. నిత్యం మటన్ విక్రయాలు లక్ష కేజీల దాటడం లేదు. చికెన్‌తో పోలీస్తే మటన్ ధర ఎక్కువగా ఉంది. కేజీ మటన్ ధరలో మూడు కేజీల చికెన్ లభిస్తోంది. ఇతర నాన్‌వెజ్ విషయానికి వస్తే చేపలు, రొయ్యల వినియోగం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment