
సాక్షి, హైదరాబాద్: సిరుల సింగరేణిని పరులపాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రజలు, ఇతర పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. కేంద్రం కుట్రపూరితంగా సింగరేణి బొగ్గుగనుల సంస్థను ఖాయిలా పడేట్టుగా చేసి దానిని తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అక్కడి గనులను నామినేషన్‌పై ఇచ్చిన విధంగా సింగరేణికి చెందిన నాలుగు గనులను కూడా తెలంగాణకే ఇవ్వాలని కోరితే కేంద్రం నుంచి స్పందన కరువైందన్నారు.
వీటిని రాష్ట్రానికి కేటాయించాలంటూ సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధానికి, కేంద్రానికి లేఖలు రాశారని తెలిపారు. ఈ నాలుగు గనులను వేలానికి పెడతామని, అందులో రాష్ట్రప్రభుత్వం కూడా పాల్గొనాలని కేంద్రం సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. గురువారం అసెంబ్లీలో గనుల రాబడిలో పెరుగుదలపై సభ్యులు బాల్క సుమన్, కోరుకంటి చందర్, రోహిత్‌రెడ్డి వేసిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. బయ్యారం స్టీల్‌ఫా్యక్టరీ ఏర్పాటు విషయమై కేంద్రాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రం ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్రమే ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తోందని కేటీఆర్ చెప్పారు. ఇటీవల దావోస్‌లో దీనిపై జిందాల్, మిత్తల్ సంస్థల ప్రతినిధులతో ప్రాథమికంగా చర్చించామన్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా రూ.39.40 కోట్ల ఆదాయమొస్తే, తెలంగాణ ఏర్పడ్డాక రూపొందించిన ఇసుక పాలసీ వల్ల ఏడాదికే రూ.800 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.
రహదారులపై ప్రార్థనాస్థలాల తొలగింపునకు చట్టం
హైదరాబాద్‌లో రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రార్థనాస్థలాల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చే యోచనలో ఉందని కేటీఆర్ వెల్లడించారు. ఏ దేవుడూ లేదా భక్తులూ దుమ్ము, ధూళీలో ఉండాలని అనుకోరని అన్నారు. నరేంద్రమోదీ సీఎంగా ఉండగా గుజరాత్‌లో రోడ్లకు అడ్డంగా ఉన్న మతపరమైన కట్టడాలను తొలగించేందుకు చట్టం తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బుధవారం అసెంబ్లీలో నగరంలో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ)పై నగర ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అరెకపూడి గాంధీ వేసిన ప్రశ్నల సందర్భంగా డి.సుధీర్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రస్తావనపై కేటీఆర్ పైవిధంగా స్పందించారు.
రక్షణ భూములపై కేంద్రం తీరు సిగ్గుచేటు
నగరంలోని కొన్నిచోట్ల రోడ్ల విస్తరణ, అభివృద్ధి కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని ఎనిమిదిన్నరేళ్లుగా కోరుతున్నా కేంద్రం సహకరించకపోవడం సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు. సాంకేతికంగా చూస్తే ఈ రక్షణ భూములను ఆ శాఖకు కేటాయించలేదని, రాష్ట్రం అనుకుంటే వీటి విషయంలో న్యాయపరమైన చిచ్చుపెట్టే అవకాశమున్నా దేశరక్షణ దృష్ట్యా తమకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. జూబ్లీ బస్‌స్టాండ్ వైపు, ఇతర చోట్ల రక్షణ శాఖ భూముల కారణంగా రోడ్ల విస్తరణ సాధ్యం కావడం లేదని, కేంద్రం ఈ భూములు ఇవ్వకపోతే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.
త్వరలో రెండోదశ ఎస్‌ఆర్‌డీపీ
నగరంలో త్వరలోనే రెండోదశ ఎస్‌ఆర్‌డీపీ కిందరూ.4,305 కోట్ల వ్యయంతో 36 రోడ్ల పనులు చేపడుతున్నట్టు కేటీఆర్ తెలిపారు. మొదటిదశలో ఇప్పటికే 48 పనులకుగాను 11 మినహా మిగతా పూర్తయ్యాయని చెప్పారు. నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి శామీర్‌పేట్ వరకు స్కైవే నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, కానీ కేంద్రం దీనికి అనుమతించడం లేదని చెప్పారు.
దావోస్ పర్యటనతో రూ.21,400 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ ప్రగతిశీల నిర్ణయాలకు సంకేతంగా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ ఏడాది రూ. 21,400 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించినట్టు కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు, లైఫ్‌సైన్సెస్, బ్యాటరీ తయారీ, ఎఫ్‌ఎంసీజీ, జీసీసీ వంటి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులను రాబట్టినట్లు తెలిపారు. మొత్తం ఐదు పర్యాయాల దావోస్ పర్యటనలు కలిపి దాదాపు 47 బిలియన్ డాలర్ల మేర రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయన్నారు. వివిధ విదేశీ కంపెనీల పెట్టుబడులకు అదనంగా నాలుగవ పారిశ్రామిక విప్లవంలో భాగంగా హైదరాబాద్‌లో ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్‌పై దృష్టి సారిస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు.