సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఓటింగ్‌ను నాయకులను ఎన్నుకునేందుకు చేపడతారు. అయితే బేగంపేట గురుమూర్తిలేన్ ప్రాంతంలో మాత్రం వైన్ షాప్ ఉండాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్ నిర్వహించారు. గుర్తిమూర్తిలేన్‌లో వైన్‌షాపు ఏర్పాటుపై గత కొద్ది రోజులుగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపును ఏర్పాటుచేశామని నిర్వాహకులు చెప్పారు. అయితే దీనిపై ఓటింగ్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
గతంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్న సందర్భంలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్‌కు అనుబంధంగా ఉన్న ‘హక్కు ఇన్షియేటివ్ అండ్ ఛానల్’ సంస్థను పలువురు స్థానికులు ఆశ్రయించారు. సదరు సంస్థ ప్రతినిధులు శనివారం సిటిజన్ రెఫరెండమ్ పేరుతో గుర్తిమూర్తి లేన్ నివాస, వాణిజ్య కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఓటింగ్ నిర్వహించారు. ‘మీకు మీ ఏరియాలో వైన్ షాపులు ఉండడం ఇష్టమేనా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 1479 మంది ఓటు వేయగా ఆదివారం కౌంటింగ్ ప్రక్రియ జరిపారు. 1415 మంది (95.67 శాతం) ‘నో’ (వద్దు) అని ఓట్ చేయగా, 53 మంది (3.58 శాతం) మంది ‘ఎస్’ (కావాలి) అని ఓట్ చేశారు. 11 ఓట్లు చెల్లలేదు. ఓట్లు వేసిన వారిలో 737 మంది (49.8 శాతం) మహిళలు, 742 మంది (50.16) పురుషులు ఉన్నారు.
కోర్టులో పిటిషన్..
‘హక్కు ఇన్షియేటివ్ అండ్ ఛానల్’ సంస్థ నిర్వహించిన ఈ ఓటింగ్ ఫలితాల ఆధారంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. అయితే కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. గతంలో ఇదే సంస్థ సికింద్రాబాద్ ఒకసారి, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వైన్‌షాపుల ఏర్పాటుపై పలు సర్వేలు జరిపినట్లు సమాచారం. నగరంలో ఇది రెండో ఓటింగ్ ప్రక్రియ.
Comments
Please login to add a commentAdd a comment