సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో మరో కట్టడాన్ని హైడ్రా ఆదివారం(సెప్టెంబర్8) కూల్చివేసింది. ఈ భవనంలో హోటల్ నిర్వహించే వాళ్లు కూల్చివేతలను అడ్డుకున్నారు.
పెట్రోల్ పోసుకుని అంటించుకుంటామని ఆందోళనకు దిగడంతో అక్కడ ఉదద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోల్ పోసుకున్న వ్యక్తి నిప్పంటించుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. హోటల్ భవనాన్ని కూల్చివేస్తామని ఇప్పటికే నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది.
మరళీమోహన్ ‘జయభేరి’కి నోటీసులు
సినీనటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా తాజాగా నోటీసులిచ్చింది. గచ్చిబౌలిలోని రంగలాల్‌కుంట చెరువులో జయభేరికి చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొంది. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హెచ్చరించింది.
పలు ప్రాంతాల్లో ‘హైడ్రా’ కూల్చివేతలు..
హైదరాబాద్‌లోని చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా కొనసాగిస్తోంది. తాజాగా ఆదివారం(సెప్టెంబర్ 8) ఉదయం దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని అక్రమ విల్లాలు, మదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, సున్నం చెరువులో అక్రమంగా నిర్మించిన షెడ్‌లను కూల్చివేస్తుండగా భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
మియాపూర్‌లోని స్వర్ణపురి కాలనీలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సంగాారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. హెచ్‌ఎంటీ నగర్, వాణి నగర్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
ఇదీ చదవండి.. కూల్చివేతే చెరువుల పరిరక్షణా..?
Comments
Please login to add a commentAdd a comment