నిరుద్యోగ ‘యువ భారత్‌’ | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ ‘యువ భారత్‌’

Published Fri, Mar 29 2024 2:42 AM

India Employment Report 2024 revealed - Sakshi

83 శాతం మంది వారే.. 2000తో పోల్చితే 2022లో రెండింతలు పెరిగిన నిరుద్యోగులు

అటాచ్‌మెంట్లతో ఈ– మెయిల్స్‌ కూడా పంపలేని దుస్థితి... 

తెలంగాణ నిరుద్యోగుల్లో అమ్మాయిలే ఎక్కువ 

ఐఎల్‌ఓ, ఐహెచ్‌డీ సంయుక్తంగా వెల్లడించిన 

ఇండియా ఎంప్లాయ్‌మెంట్‌ రిపోర్ట్‌ 2024 చెబుతున్నది ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగయువత అనేక సవాళ్లు ఎదు ర్కొంటోంది. భారత్‌లోని నిరుద్యోగుల్లో 83 శాతం యువతే ఉండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాథమికోన్నత విద్య (సెకండరీ) లేదా ఆపై ఉన్నతవిద్య (హయ్యర్‌) అభ్యసించిన యువత నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. వీరి శాతం 2000లో 35.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 65.7 శాతానికి (నిరుద్యోగుల శాతం) పెరిగింది.

ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యుమన్‌ డెవలప్‌మెంట్‌ (ఐహెచ్‌డీ) సంయుక్తంగా రూపొందించి తాజాగా విడుదల చేసిన ఇండియా ఎంప్లాయిమెంట్‌ రిపోర్ట్‌ 2024లో అనేక అంశాలు వెల్లడయ్యాయి. 2000– 2019 సంవత్సరాల మధ్య యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (అండర్‌ ఎంప్లాయ్‌మెంట్‌) తగ్గడం వంటివి భారీగా పెరగగా, కోవిడ్‌ సందర్భంగా మాత్రం కొంత తగ్గుదల నమోదైనట్టుగా ఈ నివేదిక పేర్కొంది.

2000– 2019 మధ్యలో యువత నిరుద్యోగిత శాతం దాదాపు మూడింతలు (5.7 – 17.5 శాతం) పెరిగింది. 2022 నాటికి అది 12.4 శాతానికి తగ్గింది’ అని ఈ నివేదిక చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వయిజర్‌ వి.అనంత నాగేశ్వరన్‌ తెలిపారు. 

తెలంగాణ విషయానికొస్తే...
సెకండరీవిద్య, ఆపై ఉన్నత చదువులు చదివినా తెలంగాణకు చెందిన యువత ఎక్కువగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా ఇండియా ఎంప్లాయ్‌మెంట్‌ రిపోర్ట్‌ 2024లో నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం...

15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 30.3 శాతం అమ్మాయిలు, 18.3% అబ్బాయిలు (మొత్తం 48.6%) నిరుద్యోగులుగా ఉన్నారు. అదే జాతీయ స్థాయిలో ఇదే కేటగిరిలో చూస్తే 65.7 శాతంగా ఉంది. 
♦ రాష్ట్రంలో 2005 నుంచి యువతలో నిరుద్యోగిత శాతమనేది క్రమంగా పెరుగుతోందని ఈ నివేదిక తెలిపింది. 2005లో చూస్తే.. యువతలో 14.1నిరుద్యోగ శాతం ఉండగా, 2012కల్లా 14.9 శాతానికి, 2019 కల్లా 34.9 శాతానికి చేరుకుంది.  
 అదే 2022 సంవత్సరంలో 21.7శాతానికి తగ్గుముఖం పట్టింది. అయితే 2022లో అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా సాధించారు. నిరుద్యోగిత శాతం అబ్బాయిల్లో 18.3 శాతం ఉండగా, అమ్మాయిల్లో అది 30.3 శాతంగా ఉంది. 
 2022లో రాష్ట్రంలో 27.5% మంది యువత ‘నాట్‌ ఇన్‌ ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్స్న్‌ ఆర్‌ ట్రైనింగ్‌’ (నీట్‌) కేటగి రిలో ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. 2005 నుంచి 2019 మధ్యలో అది 17.9 శాతం నుంచి 34 మధ్యలో ఉంది.  
♦ రాష్ట్రంలో పదిహేనళ్లకు పైబడిన క్యాజువల్‌ వర్కర్ల నెలవారీ వేతనం విషయానికొస్తే...2022లో మగవారిది రూ.10,175గా, మహిళలది రూ.6,642గా ఉంది. 

మనోళ్ల టెక్‌ స్కిల్స్‌ అంతంతే...
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే తెలంగాణ సాంకేతికంగా, టెక్‌ స్కిల్స్‌లో ఉన్నతస్థాయిలో నిలుస్తుందని అనుకుంటాం. కానీ...
దాదాపు 90 శాతం యువత ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌  ఉపయోగించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ లేదా కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ కూడా రాయలేకపోతున్నారు.
 అధికశాతం విద్యార్థులకు ఎమ్మెస్‌ ఎక్సెల్‌ తదితర అప్లికేషన్లలో విస్తృతమైన పరిజ్ఞానం, అవగాహన లేదు.
 50 శాతానికి పైగా యువత అటాచ్‌మెంట్‌తో కూడిన ఈ–మెయిల్‌ను కూడా పంపించలేకపోతున్నారు.
 53.83 శాతం యువత కాపీ చేసి ఫైల్‌ను మూవ్‌ చేయగలుగుతున్నారు.
50.4 శాతం మంది ఏదైనా ఫైల్‌ను కాపీ, పేస్ట్‌ చేయగలుగుతున్నారు.
కేవలం 14.7 శాతం మాత్రమే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎలక్ట్రానిక్‌ ప్రజెంటేషన్‌ చేస్తున్నారు. 

నిపుణులు ఏమంటున్నారంటే...
తెలంగాణలోని అనేక స్కూళ్లలో కంప్యూటర్‌ ల్యాబ్‌లున్నా, సాంకేతిక అంశాలు బోధించే టీచర్లు, టెక్‌ నైపుణ్యం ఉన్నవారు లేకపోవడమే కారణమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ అంశాలన్నింటిని కూడా పాఠశాల బోధనాంశాల్లో చేర్చితేనే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు.  

Advertisement
Advertisement